పాండోరా పేపర్స్ (Pandora Papers Leak) ద్వారా వెలుగులోకి వచ్చిన పన్ను ఎగవేత కేసులపై దర్యాప్తు జరపనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ). ఈమేరకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడించారు సీబీడీటీ అధికార ప్రతినిధి.
పలువురు వ్యాపారవేత్తలతో సహా ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలు, దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవారు.. ఇలా అందరూ కలిపి 300 మందికి పైగా భారతీయులు పన్నుఎగవేతకు పాల్పడినట్లు తెలిపే పాండోరా పేపర్స్‌ను (Pandora Papers India) 'అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి' (ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్- ఐసీఐజే) (ICIJ News) విడుదల చేసింది. అయితే చాలామంది ప్రముఖులు ఈ లీక్‌లను కొట్టిపారేశారు.
అయితే ఈ వ్యవహారాన్ని కేంద్రం ప్రత్యక్ష పన్నుల బోర్డ్ నిశితంగా గమనిస్తోందని సీబీడీటీ అధికార ప్రతినిధి తెలిపారు. దీనిపై దర్యాప్తును సీబీడీటీ ఛైర్మన్ పర్యవేక్షించాలని కేంద్రం ఆదేశించినట్టు చెప్పారు. సీబీడీటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, రిజర్వు బ్యాంక్, ఫైనాన్షియన్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన అధికారులు ఈ దర్యాప్తు బృందంలో భాగస్వాములుగా ఉంటారని వివరించారు. దీనిపై విచారణ పూర్తికాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పన్ను ఎగవేతదారుల సమాచారం పొందడం కోసం విదేశాల్లో ఉన్న అధికార పరిధిని కూడా ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'పాండోరా పేపర్స్' లీక్.. ప్రముఖుల బాగోతాలు బట్టబయలు