Case Filed on Janasena Chief Pawan Kalyan: ఏలూరులో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయగా.. అవి రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగాయి. దీనిపై వాలంటీర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజలకు మేలు చేసే తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని.. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పవన్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయవాడ సచివాలయంలో పని చేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ పై సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ (IPC) సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 153 ప్రకారం పవన్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది. 153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలకు అవకాశం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినప్పటికీ కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది.
వాలంటీర్లపై మరోసారి వ్యాఖ్యలు: తాను జనవాణి ప్రారంభించేందుకు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా తాడేపల్లిగూడేంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరోసారి వాలంటీర్ వ్యవస్థపై పవన్‌కల్యాణ్ విరుచుకుపడ్డారు. రెడ్ క్రాస్‌కు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ హెడ్‌గా ఉంటారు... ఇక్కడ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. వాలంటీర్లు అనేక చోట్ల ప్రజలను వేధిస్తున్నారన్నారు.. తిరుపతిలో ఎర్రచందనం రవాణాలో వాలంటీర్లు పట్టుబడ్డారన్నారు. నేరం చేసిన వాలంటీర్లకు భయం లేదని.. మా జగనన్న నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చేశాడు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో ఉన్నారని పవన్ స్పష్టం చేశారు.
ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పునరుద్ఘాటించారు. జగన్ మహిళలను కించపరిచి రేపిస్టులను పెంపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల తప్పుడు పనులు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. జగన్ నిర్మించిన వాలంటీర్ వ్యవస్థ నడుం విరగ్గొడతానని హెచ్చరించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది.. ఆ సమాచారం అంతా ఎక్కడకు పోతోంది..? అమ్మాయిల అదృశ్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు స్పందించరు? అని ప్రశ్నించారు.