Case File on AR Inspector Swarna Latha: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రెండు వేల నోట్ల మార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖలో 2వేల నోట్ల మార్పిడి ముఠా వద్ద 12 లక్షలు తీసుకున్నారంటూ.. AR ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత సహా మరో ఇద్దరు హోంగార్డులపై.. FIR నమోదు అయ్యింది. ఆమెతో పాటు హోంగార్డులు శ్యామ్ సుందర్ అలియాస్ మెహర్, శ్రీను పైనా కేసు నమోదు చేశారు. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా వ్యవహించిన సూరిబాబు పైనా ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. రెండు రోజుల క్రితం పెద్ద మొత్తంలో 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి యత్నించారు. సూరిబాబు అనే.. వ్యక్తి 90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లతో.. బీచ్‌రోడ్డులో వెళ్తున్నారు. ఆ సమయంలో రాత్రి విధుల్లో ఉన్న AR ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత తనిఖీలు.. నిర్వహిస్తున్నారు. ఆ డబ్బు గురించి స్వర్ణలత ఆరా తీశారు. కమిషన్ ప్రాతిపదికన.. 2వేల రూపాయల నోట్ల మార్పిడికి తీసుకెళ్తున్నట్లు సూరిబాబు చెప్పాడు. దీంతో ఆ నగదుకు.. ఆధారాలు లేవని గ్రహించిన స్వర్ణలత.. సూరిబాబును బెదిరించి 12 లక్షల రూపాయలు తీసేసుకున్నారు.
ఎవరికైనా చెప్తే మొత్తం సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఐతే.. ఆ డబ్బు నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్‌కు చెందినది కావడంతో.. వారు విశాఖ CP త్రివిక్రమ వర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు.... స్వర్ణలత చేతివాటం రుజువు కావడంతో.. FIR నమోదు చేశారు. తనిఖీల్లో స్వర్ణలతతోపాటు ఉన్న హోంగార్డులు శ్యామ్‌సుందర్, శ్రీను,.. నోట్ల మార్పిడి మధ్యవర్తి సూరిబాబుపైనా FIR నమోదు చేశారు. అయితే ఆమెకు అనుకూలంగా అధికార పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
Visakha CP on 2000 Notes Exchange: విశాఖలో రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించిన వివరాలను సీపీ త్రివిక్రమ వర్మ మీడియాకు వెల్లడించారు. డీసీపీ విద్యాసాగర్ నాయుడుకు బాధితులు ఫిర్యాదు చేశారని.. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. నావెల్ విశ్రాంత అధికారులు శ్రీధర్, శ్రీనులు రెండు వేల నోట్లు మార్చే ప్రయత్నంలో 90 లక్షలు ఇస్తే కోటి రూపాయిలు ఇస్తామని సూరి అనే మధ్యవర్తి ద్వారా ఒప్పందం చేసుకున్నారని.. ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో 90 లక్షలు ఇస్తే.. కోటి రూపాయిలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని తెలిపారు. గోపి అనే ఉద్యోగి, సూరిల ద్వారా ఈ వ్యవహారం నడిచిందని తెలిపారు. మధ్యవర్తులు రిజర్వ్ సీఐ స్వర్ణలత డ్రైవర్ మెహర్, శ్రీనులకు ఈ విషయాన్ని తెలుపగా.. వారు స్వర్ణలతతో చెప్పారని సీపీ స్పష్టం చేశారు.
ముందు సీఐ స్వర్ణలత, డ్రైవర్లకు పది లక్షలు ఇవ్వడానికి గురువారం మధ్యవర్తి సూరి డీల్ కుదుర్చుకున్నారని.. ఒప్పందం కుదిరిన తరవాత స్వర్ణలత డ్రైవర్స్ సూరిని కొట్టారన్నారు. ఆదాయపు పన్ను లేదా టాస్క్‌ఫోర్స్ కి చెబితే మొత్తం సొమ్ము పోతుందని.. అందువల్ల కమిషన్ ఎక్కువ ఇవ్వాలని బెదిరించారని సీపీ వెల్లడించారు. బాధితులకు ఈ విషయం తెలియడంతో వారు.. డీసీపీని కలిసి ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారం బయట పడిందని పేర్కొన్నారు. ఈ కేసులో సూరిని ఏ1గా చేర్చి కేసు నమోదు చేశామని.. స్వర్ణలతను ఏ4గా చేర్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు సాగుతోందని సీపీ తెలిపారు. కాగా, రెండు వేల నోట్లు మార్చుకునే వారికి సెప్టెంబర్ నెలాఖరు వరకు అవకాశం ఉందని.. మధ్యవర్తుల మాట నమ్మవద్దని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.