బలహీన వర్గాల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు దేశంలో ఏదో మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి సంఘటనే తమిళనాడు విలుప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విషయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారన్న కోపంతో ముగ్గురు వ్యక్తులతో కాళ్లు మొక్కించుకున్నారు పంచాయతీ పెద్దలు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారగా.. పోలీసుల వరకు చేరింది. పంచాయతీ పెద్దలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఏం జరిగింది?
జిల్లాలోని ఒట్టనెండల్ ప్రజలు మే12న గ్రామంలో జాతర నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి కరోనా ఆంక్షలు ఉన్నందువల్ల జాతర నిర్వహించవద్దని హెచ్చరించి ఉత్సవాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. అయితే అదే రోజు సాయంత్రం మళ్లీ డప్పు చప్పుల్లతో జాతర నిర్వహించారు. దీనిపై పోలీసులకు కొందరు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు సంగీత వ్యాయిద్యాలను తీసుకెళ్లారు.
జాతర ఆగిపోవడానికి ముగ్గురు వ్యక్తులు కారణమని, వారితో ఉత్సవం చేసే మరికొందరు వ్యక్తులు గొడవ పడ్డారు. దీనిపై ఊర్లో తెల్లవారి పంచాయతీ నిర్వహించారు గ్రామ పెద్దలు. పంచాయతీలో తామే సమాచారం ఇచ్చామని ఆ ముగ్గురు వ్యక్తులు ఒప్పుకున్నారు. అందుకు వాళ్లు కాళ్లమీద పడాలని పెద్దలు ఆదేశించారు. దాంతో వారు ఊరి వారందరి సమక్షంలో కాళ్లమీద పడ్డారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దాంతో కొవిడ్ నిబంధనలు అతిక్రమించి జాతర నిర్వహించినందుకు, కాళ్లు మొక్కించుకున్నందుకు పంచాయతీ పెద్దలు సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: సీఎం పర్యటనకు రైతుల సెగ- పోలీసుల లాఠీఛార్జ్