Kerala Caravan Tourism: దేవభూమిగా పేరొందిన కేరళ రాష్ట్రం కారవాన్ టూరిజం ప్రాజెక్టును విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. 'కారవాన్ కేరళ' నినాదం వాటాదారుల దృష్టిని సైతం ఆకర్షిస్తుండటం వల్ల రాష్ట్రంలో వెయ్యికి పైగా కారవాన్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కేరళ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం వల్ల త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 150 కారవాన్ పార్కులు, సైట్‌లను ఏర్పాటు చేసే అవకాశముంది. ఇడుక్కి జిల్లాలోని వాగామణ్‌లో అపుడే ఓ కారవాన్ పార్కు ప్రారంభం కాగా, కొన్ని కారవాన్‌లు రాష్ట్రమంతా తిరుగుతున్నాయి.
'కారవాన్‌లు నడుపుతున్న వ్యాపారులకు మోటారు వాహనాల శాఖ మంజూరు చేసిన మినహాయింపులకు అదనంగా రూ.2 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది అని రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి పి.ఎ.మహమ్మద్ రియాజ్ తెలిపారు. కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరిశుభ్రత, భద్రత, సామాజిక దూరం వంటి అత్యున్నత ప్రమాణాలు కొనసాగిస్తూనే ఈ కొత్త ప్రాజెక్టును బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని కేరళ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాస్, టూరిజం డైరెక్టర్ వీఆర్ కృష్ణతేజ తెలిపారు. కారవాన్‌లలో ఆధునిక సౌకర్యాల వంటగది, ఏసీతో పడక, డైనింగ్ టేబులు, స్నానాల గది, ఆడియో.. వీడియో సౌకర్యాలు, జనరేటర్ సహా పలు సదుపాయాలు ఉంటాయి.
ఇవీ చదవండి: '50 ప్లస్' మహిళల సాహసయాత్ర.. హిమాలయాల్లో కాలినడకన.. వేల కి.మీ. ట్రెక్కింగ్..
ఉద్యమం కోసం ఆస్తులన్నీ దానం.. దుస్తుల్ని తగులబెట్టి వారికి ఎదురెళ్లి..