Car Thief Arrested in Delhi: రాయల్ లైఫ్ కోసం అతను దొంగతనాలు ప్రారంభించాడు. పోలీసులకు చిక్కకుండా.. కార్లను కొట్టేయడం మొదలుపెట్టాడు. సీసీటీవీల్లోనూ అతని ఆచూకీ తెలియదు. ఒకటి, రెండు కాదు.. అతను దొంగిలించిన కార్ల సంఖ్య వందల్లో ఉంటుంది. ఒక్క ఏడాదిలో ఏకంగా 100 కార్లను కొట్టేసిన చరిత్ర అతనిది. ఈ కార్ రాజాపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో 'కార్ రాజా' ఆగడాలకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావించిన దిల్లీ పోలీసులు దాదాపు రెండు నెలలు శ్రమించి నిందితుడిని పట్టుకున్నారు.
సీసీటీవీలకు చిక్కడు..
ఈ అంతర్రాష్ట్ర దొంగ.. దిల్లీ ఎన్సీఆర్, యూపీ, కశ్మీర్ పరిధిలో కార్ల చోరీలకు పాల్పడుతుంటాడు. ఆర్డర్ రావడమే ఆలస్యం.. చిన్న కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు ఏదైనా క్షణాల్లో మాయం చేసి నెంబర్ ప్లేట్లు తారుమారు చేసి కస్టమర్లకు అమ్మేస్తుంటాడు. అందుకే ఇతనికి 'కార్ రాజా' అని పేరు వచ్చింది. ఈ కార్ రాజా.. కునాల్ అలియాస్ తనుజ్ అలియాస్ విజయ్‌గా కూడా బ్లాక్ మార్కెట్లో సుపరిచితుడు. కునాల్‌ను సీసీటీవీతో గుర్తించాలని అనుకున్న పోలీసులకు నిరాశే మిగిలింది.
క్రిమినల్ రికార్డ్స్ తిరగేస్తే..
కార్ రాజాను పట్టుకునేందుకు పోలీసులు.. అతను నిందితుడిగా ఉన్న ఇతర నేరాలకు సంబంధించిన రికార్డ్స్‌ను తిరగేయగా ఆచూకీ లభించింది. ఈనెల 11న అతను కారును విక్రయించేందుకు దిల్లీలోని మోనాస్ట్రీ మార్కెట్‌కు వస్తాడని పోలీసులకు సమాచారం అందింది. పథకం ప్రకారం పోలీసులు నిందితుడిని అదే రోజు అరెస్ట్ చేశారు.
నిందితుడి వద్ద ఉన్న ఆర్సీ, నెంబర్ ప్లేట్లకు కారు ఛాసిస్, ఇంజిన్ నెంబర్లకు సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. వీటితో పాటు వివిధ నెంబర్ ప్లేట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 'కార్ రాజా'పై ఇప్పటివరకు తొమ్మిది కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
2013 నుంచే..
ఈ కార్ల దొంగతనాలను 2013 నుంచే ప్రారంభించినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. విలాస జీవితం కోసమే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. అమర్ కాలనీ పరిధిలో తన తండ్రి ఓ వ్యాపారి అని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి : ఆరుగురు ఉగ్ర అనుచరులు అరెస్ట్- భారీగా ఆయుధాలు స్వాధీనం!