Car Hits Dumper in Uttar Pradesh After Tire Burst : ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్‌ను ఓ కారు ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బహేడీ ప్రాంతానికి చెందిన కొందరు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బరేలీ- నైనీతాల్ రహదారిపై వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి మరో లేన్‌లోకి వెళ్లింది. ఎదురుగా వస్తున్న డంపర్‌ను వేగంగా ఢీకొనడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదేసమయంలో కారు డోర్ లాక్ అయిపోయింది. లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశమే లేకపోవడం వల్ల ప్రయాణికులంతా సజీవ దహనమయ్యారు.
ఢీకొట్టిన తర్వాత ఈడ్చుకెళ్లి!!
కారులో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఓ చిన్నారి సైతం సజీవ దహనమైనట్లు చెప్పారు. కారు, డంపర్ నుంచి భారీగా మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన స్థానికులు తమకు సమాచారమిచ్చారని పోలీసులు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు. 'ఢీకొట్టిన తర్వాత కారును డంపర్ కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా లాక్ అవ్వడం వల్ల ఎవరూ బయటకు రాలేకపోయారు' అని బరేలీ ఎస్ఎస్పీ ఘులే సుశీల్ చంద్రబన్ తెలిపారు.
పరారీలో డంపర్ డ్రైవర్
మృతుల్లో ముగ్గురి గుర్తింపును పోలీసులు నిర్ధరించారు. మృతదేహాలన్నింటినీ పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. 'ఉన్నతాధికారులు సైతం ఘటనాస్థలిని పరిశీలించారు. డంపర్ డ్రైవర్ పారిపోయాడు. మృతులను ఫర్కాన్, ఆరిఫ్, ఆసిఫ్‌లుగా గుర్తించాం. వీరంతా బెహారీలోని జామ్‌నగర్‌కు చెందినవారు. ప్రమాదానికి గురైన కారును ఫర్కాన్ బుక్ చేసుకున్నాడు. బరేలీలోని ఫహామ్ లాన్లో జరిగిన వివాహ కార్యక్రమానికి వీరంతా హాజరై తిరిగి వెళ్తున్నారు. మృతుల్లో ఒకరైన ఆరిఫ్ ఎనిమిది రోజుల క్రితమే వివాహం చేసుకున్నాడు' అని పోలీసులు వివరించారు.