తమిళనాడులో ఏఫ్రిల్ 6న 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్‌కు ఇంకా కొద్ది వారాలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ ఒక్క నెల గడువే అత్యంత కీలకం. ఇలాంటి తరుణంలో తమిళ రాజకీయ పార్టీలకు కరోనా సెగ తగిలింది. తమ అభ్యర్థులు, ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించే నేతలు వైరస్ బారిన పడుతున్నారు. దీని వల్ల వారు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. దీంతో తాము ప్రచారంలో ఎక్కడ వెనుకబడిపోతామేమోనని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
కమల్ అభిమానుల్లో కలవరం..
![Candidates getting infected with Covid-19 perils TN election campaigns](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11139881_im3.jpg)
కొద్ది రోజుల క్రితం వెలాచెరి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అభ్యర్థి సంతోష్ బాబుకు కరోనా సోకినట్లు తేలింది. నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉన్న అభ్యర్థి ఎన్నికలతో సంబంధమున్న ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. దీంతో ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ మద్దతుదారులు నిరుత్సాహానికి లోనయ్యారు. ప్రచారం నిలిచిపోతోందని కలవరపాటుకు గురయ్యారు.
అందరూ పాటించాలి..
కరోనా వ్యాప్తి మళ్లీ పెరగడంపై తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి జే రాధాక్రిష్ణన్ ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. వైరస్ మళ్లీ తీవ్రరూపం దాల్చి భయానక పరిస్థితులు రాకుండా ఉండాలంటే విపత్తు నిర్వహణ చట్టం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ప్రజలతో పాటు పార్టీల అభ్యర్థులు కూడా కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు, నాయకులు కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని ఎన్నికల అధికారులకు సూచించినట్లు వివరించారు.
ఈ విషయంపై మక్కల్ నీది కచ్చి ప్రెస్ కోఆర్డినేటర్ మురళి అబ్బ కూడా ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులు కొంతమంది కరోనా బారిన పడటం వల్ల మంచానికే పరిమితమయ్యారని చెప్పారు. అయినా వారు ఆన్లైన్ వేదికగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. తమ అభ్యర్థులు త్వరగా కోలుకుని ఉత్సాహంగా ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంపై మాత్రమే కాకుండా కరోనాపై కూడా ప్రజలకు పార్టీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని మురళి సూచించారు.
ప్రజాస్వామ్య పండుగ.. కానీ..
![Candidates getting infected with Covid-19 perils TN election campaigns](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11139881_im.jpg)
భారత్‌లో ఎన్నికలంటే ప్రజ్వాస్వామ్య పండుగ. నాయకులు, కార్యకర్తలు పార్టీల జెండాలు, ప్రత్యర్థులపై విమర్శలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తారు. భారీ జన సందోహం నడుమ కార్లు, జీపులతో ర్యాలీలు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ ఆర్బాటాలే సమస్యగా పరిణమించాయి. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనేక మంది కరోనా బారిన పడే పరిస్థితి నెలకొంది.
![Candidates getting infected with Covid-19 perils TN election campaigns](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11139881_im2.jpg)
డీఎండీకే ఉప కార్యదర్శి..
దేశియ మర్పొక్కు ద్రవిడర్ కజగం ఉప కార్యదర్శి ఎల్ కే సుధిశ్ కూడా కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం మార్చి 21 ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైరస్ నుంచి కోలుకున్న వెంటనే ప్రచారంలో మళ్లీ పాల్గొంటారని ఆయన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
వీరితో పాటు మక్కల్ నీది మయ్యం పార్టీ అన్నా నగర్ అభ్యర్థి పొన్రాజ్, డీఎంకే చోలింగనల్లూర్ అభ్యర్థి రమేశ్ అరవింద్, అదే పార్టీకి చెందిన సాలెం(పశ్చిమ) అభ్యర్థి అలగపురం ఆర్ మహరాజ్ కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు.