కర్ణాటక రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం పొందేందుకు నలుగురు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఫిజికల్ టెస్ట్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. శరీర బరువు ఎక్కువగా చూపించేందుకు ఒకరు లోదుస్తులు, ఇంకొకరు షర్టులో తూకపు రాళ్లను పెట్టుకురాగా.. మరొకరు నడుముకు ఇనుప గొలుసు చుట్టుకొచ్చారు. అధికారులు నిర్దేశించిన బరువు లేని అభ్యర్థులు ఈ తరహా చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన కేకేఆర్టీసీ అధికారులు నిర్వహించిన ఫిజికల్ ఫిట్‌నెట్ పరీక్షల్లో ఈ ఘటనలు జరిగాయి.
వివరాల్లోకి వెళితే.. కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,619 ఉద్యోగాలను ఫిట్‌నెట్ పరీక్షల ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షలకు నిర్ణీత ఎత్తుతో పాటు 55 కిలోల బరువును అర్హతగా నిర్దేశించింది. మొత్తం 38వేల మందికి పైగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకున్నారు. కాగా కలబురిగి జిల్లాలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు జరిగాయి. ఎత్తులో అర్హత సాధించిన ఓ నలుగురు అభ్యర్థులు.. శరీర బరువు తక్కువ వస్తుందన్న అనుమానంతో ఇలా తూకపు రాళ్లు, ఇనుప గొలుసులతో అక్రమాలకు పాల్పడ్డారు.
ఓ వ్యక్తి ఐదు కిలోల బరువున్న రెండు తూకపు రాళ్లను లోదుస్తుల్లో పెట్టుకున్నాడు. మరో వ్యక్తి ఓ ఇనుప గొలుసును నడుముకు చుట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి కాళ్లకు ఇనుప గొలుసును కట్టుకున్నాడు. నాలుగో వ్యక్తి ప్రత్యేకంగా రూపొందిన ఓ బరువైన షర్ట్‌ను ధరించాడు. నిబంధలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఆ నలుగురు అభ్యర్థులను అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించారు. కాగా వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. మానవతా దృక్పథంతో వారిని వదిలేసినట్లు వెల్లడించారు. అనంతరం మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించినట్లు చెప్పారు.