Canal Man of India: సంకల్పానికి వయసుతో సంబంధం లేదంటారు. తన గ్రామానికి కాలువ తవ్వి కెనాల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన లాంగీ భూయాన్‌ను చూస్తే అదే అనిపిస్తుంది. కొండ నుంచి స్వగ్రామం వరకు 30 ఏళ్లపాటు ఒంటరిగా, అవిశ్రాంతంగా శ్రమించి మూడు కిలోమీటర్ల కాలువ తవ్విన భూయాన్.. ఇప్పుడు మరో మహా యజ్ఞానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందులాగే ఈసారి కూడా ఎవరి సాయం తీసుకోకుండా సొంతంగా కాలువ తవ్వాలని నిశ్చయించుకున్నారు కెనాల్ మ్యాన్.
లాంగీ భూయాన్ది.. బిహార్‌లోని కొథిల్వా గ్రామం. సమీపాన ఉన్న కొండప్రాంతాల్లో వృథాగా పోతున్న నీటిని గ్రామంవైపు మళ్లించేందుకు కాలువ తవ్వారు. గ్రామస్థులు మద్దతు ఇవ్వకపోయినా, ఎగతాళి చేసినా పట్టించుకోకుండా శ్రమించారు. ఇప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాల కోసం అదే స్థాయిలో శ్రమిస్తున్నారు.
కొత్తగా తవ్వే కాలువ ద్వారా ఐదు గ్రామాలకు సాగునీరు అందుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు లాంగీ భూయాన్. దాదాపు మైలు పొడవు ఉండే ఈ కాలువలో చేపల పెంపకం కూడా చేపట్టి, ఈ ప్రాంతంలోని పేదరికాన్ని పారదోలచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"మరో కాలువ తవ్వాలని నిశ్చయించుకున్నాను. ఇదివరకు తవ్విన కాలువ కేవలం కొథిల్వా గ్రామానికి సరిపోతోంది. ఇప్పుడు లుటువా సహా చుట్టుపక్కల గ్రామాలకు సరిపడా నీరు అందేలా కాలువ తవ్వుతున్నాను. రోజుకు 4 నుంచి 5 గంటలు పనిచేస్తున్నాను."
-లాంగీ భూయాన్, కెనాల్ మ్యాన్
ఇదీ చూడండి : వేలంలో 'గోల్డ్ టీ' రికార్డ్- కిలో రూ.లక్ష!