ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా ఉండే 60% శాతం సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమకానుంది. బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అయిదేళ్లలో ఈ పథకం కింద 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్రసామాజిక న్యాయం, సాధికారశాఖ మంత్రి తావర్ చంద్ గహ్లోత్, ఆ శాఖ కార్యదర్శి రెడ్డిసుబ్రహ్మణ్యంలు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ఈ పథకం కింద వచ్చే అయిదేళ్లలో రూ.59,048 కోట్లు వ్యయం చేయనున్నారు. అందులో 60% వాటా కింద కేంద్రం రూ.35,534 కోట్లు ఇవ్వనుంది. మిగిలింది రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి ఆపైన ఏ ఉన్నత విద్య కోర్సు ఎంచుకున్నప్పటికీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, నెలవారీ నిర్వహణ భత్యాలను ఈ స్కాలర్‌షిప్పు కింద అందిస్తారు.
డీటీహెచ్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలు
డీటీహెచ్ సేవల రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లను అనుమతిస్తూ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే వాణిజ్యశాఖ ఇందులోకి 100% ఎఫ్‌డీఐలను అనుమతించినప్పటికీ సమాచార, ప్రసారశాఖల మార్గదర్శకాల కారణంగా ఆ లాభం వాటికి దక్కలేదు. ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దడంవల్ల ఇప్పటివరకు 49% ఉన్న ఎఫ్‌డీఐ పరిమితి 100%కి చేరుతుంది. ఈ సంస్థలకు 20 ఏళ్లకు లైసెన్సు ఇస్తారు. ప్రతి పదేళ్లకోసారి నవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. లైసెన్సు ఫీజును 10% నుంచి 8%కి తగ్గించారు. ఈ ఫీజును ఏడాదికోసారి కాకుండా త్రైమాసికాల వారీగా వసూలు చేస్తారు.
ఫిల్మ్ యూనిట్లు ఎన్‌ఎఫ్‌డీసీలో విలీనం
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని ఫిల్మ్‌డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ సంస్థలు చేసే పనులన్నింటినీ నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషనే చేస్తుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
విమాన సర్వీసులు నడిపే విషయమై అఫ్గానిస్థాన్, ఫిలిప్పీన్స్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: డిసెంబర్ 25న రైతులతో మాట్లాడనున్న మోదీ