ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session 2021) జరగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ అయింది. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'కు (Farm laws repeal bill 2021) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
"ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్... మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై ఆమోదం తెలిపింది. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో.. ఈ చట్టాలను వెనక్కు తీసుకునేందుకు మేం ప్రాధాన్యం ఇస్తాం."
-అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి.
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నిరసనలు ప్రారంభమై ఈ నవంబర్ 26 నాటికి దాదాపు ఏడాది కానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi).. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని (farm laws repealed) సంచలన ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగణంగా పార్లమెంట్ సమావేశాల తొలిరోజే 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'ను కేంద్రం ప్రవేశపెట్టనుంది.
మొత్తం 26 బిల్లులు..
ఈ నెల 29 నుంచి డిసెంబర్ వరకు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో.. దేశంలో కొన్ని మినహా మిగతా ప్రైవేటు క్రిప్టో కరెన్సీల రద్దు/నియంత్రణ, అధికారికంగా డిజిటల్ ద్రవ్యాన్ని జారీ చేయడానికి ఆర్‌బీఐని అనుమతించడం వంటి అంశాలతో పాటు మొత్తం 26 బిల్లుల్ని ఈసారి ప్రవేశ పెట్టనున్నారు.
కీలక బిల్లులు ఇవే..
నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ఒక బిల్లు పార్లమెంటు అమోదానికి రానుంది. నకిలీ విత్తనాలు అమ్మినవారికి జరిమానా చాలా స్వల్పంగా ఉండగా, కొత్త బిల్లులో దానిని రూ.5లక్షలకు పెంచారు. విత్తనాలకు ధర అధికారం కేంద్ర ప్రభుత్వానిదే. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది.
హైకోర్టు/ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు- సేవా నిబంధనల సవరణ బిల్లు, విద్యుత్తు సవరణ బిల్లు వంటివి ప్రవేశపెట్టనున్నారు. యాచకులకు పునరావాసం కల్పించి, వారి పిల్లలకు విద్య, జీవన నైవుణ్యాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా పార్లమెంటుకు రానుంది. హైదరాబాద్ సహా పది నగరాల్లోని యాచకులందరికీ తక్షణం వునరావాసం కల్పించాలన్నది లక్ష్యం. ఐదేళ్ల పాటు అమలయ్యే ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది.
ఇదీ చూడండి: pm all party meeting: మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం!
ఇదీ చూడండి: పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల అస్త్రాలు ఇవే!