దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్(Bypoll Election) విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్(ఈసీ). 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు అక్టోబర్ 30న జరగనున్నాయి. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కరోనా మహమ్మారి, వరదలు, పండుగలు, వాతావరణ పరిస్థితులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ఆయా రాష్ట్రాలతో చర్చించాకే షెడ్యూల్ ప్రకటించినట్లు తెలిపింది ఈసీ. దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఉపఎన్నికలు జరగనుండగా.. పలు రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు(Bypoll Election 2021) ఖాళీగా ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.
అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్(Bypoll Election) రానుంది.
ఇవే ముఖ్య తేదీలు..
- ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 1
- నామినేషన్ల స్వీకరణ గడువు: అక్టోబర్ 8
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 11
- నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 13
- ఎన్నికల పోలింగ్: అక్టోబర్ 30
- ఓట్ల లెక్కింపు: నవంబర్ 2
లోక్‌సభ ఎన్నికలు ఇక్కడే..
దాద్రా నగర్ హవేలీ నియోజకవర్గం సహా హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా స్థానాలకు లోక్‌సభ బైపోల్ జరగనుంది.
అసెంబ్లీ ఉపఎన్నికలు..
3 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలతో పాటే.. వివిధ రాష్ట్రాల్లోని 30 స్థానాలకు అసెంబ్లీ బైపోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.
వీటిలో గరిష్ఠంగా అసోంలో 5 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. బంగాల్లో నాలుగు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయలో 3 చొప్పున, బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌లో 2 చొప్పున, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
హుజూరాబాద్‌లో..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election 2021) షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. పలు రాష్ట్రాల్లోని మిగతా 29 నియోజకవర్గాలతో పాటే.. ఇక్కడా అక్టోబర్ 30న ఎన్నిక(Huzurabad By Election Polling 2021) జరగనుంది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు తెలిపింది. వాటి ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు ఉపఎన్నిక (Badwel By Election 2021) షెడ్యూల్ కూడా ఈసీ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉపఎన్నిక పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు ప్రకటన జారీ చేసింది.
ఇవీ చూడండి: Ganguly News: సౌరభ్ గంగూలీకి కోల్‌కతా హైకోర్టు జరిమానా
భవానీపుర్ ఉపఎన్నికలో మార్పు లేదు.. హైకోర్టు స్పష్టం
పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు
Election Notification 2021 : హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల