దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే అసోంలో 5, బంగాల్‌లో 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. బిహార్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో రెండు.. తెలంగాణ, ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరంలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. కౌంటింగ్, ఫలితాలు నవంబర్ 2న వెలువడనున్నాయి.
ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటింగ్‌కు భారీగా తరలివచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు.
బంగాల్‌లో పోరు..
దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు జరుగుతున్నా.. అందరి చూపు బంగాల్‌పైనే ఉంది. భాజపా, టీఎంసీలు ఈ ఉపఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న నాలుగు స్థానాల్లోనూ ప్రధానంగా దిన్హంతపైనే చర్చ జరుగుతోంది. టీఎంసీ సీనియర్ నాయకుడు ఉదయన్ గుహా ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో కోల్పోయిన తన స్థానాన్ని ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహయ మంత్రిగా పనిచేస్తున్న నిశిత్ ప్రామాణిక్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సీటులో ఉపఎన్నిక అనివార్యమైంది. దిన్హంత, శాంతిపుర్ స్థానాల్లో పోటీ భాజపా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.