Madhya Pradesh Bus Accident Today : మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 24 మంది మరణించారు. సుమారు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి 20 అడుగుల ఎత్తున వంతెన నుంచి బోరాడ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ జరిగింది
ఊన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోంగర్‌గావ్‌లో గ్రామ సమీపంలో 20 అడుగుల వంతెనపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. మంగళవారం ఉదయం 8.40 గంటలకు అదుపు తప్పి బోరాడ్ నదిలో పడిపోయింది. ఏం జరిగిందో తెలిసే లోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. అంత ఎత్తు నుంచి పడడం వల్ల బస్సు నుజ్జునుజ్జు అయింది. ఫలితంగా లోపల ఉన్నవారు బయటకు రావడం కష్టమైంది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సభ్యులు.. స్థానికులతో కలిసి బస్సు నుంచి క్షతగాత్రులను వెలికి తీశారు. అనంతరం ఖర్గోన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఖర్గోన్ జిల్లా కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ, ఎస్పీ ధరమ్వీర్ సింగ్ జోషి, స్థానిక శాసనసభ్యుడు రవి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.
శారద ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ఖర్గోన్ నుంచి ఇందోర్‌కు వెళ్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. బోరాడ్ నది పూర్తిగా ఎండిపోవడం వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.
"ఖర్గోన్ జిల్లాలోని బోరాడ్ నదిపై జరిగిన బస్సు ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తాం. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాం."
-డాక్టర్ నరోత్తమ్ మిశ్రా, హోంమంత్రి
ప్రభుత్వం ఆర్థిక సాయం
బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000, స్వల్ప గాయాలైనవారికి రూ.25,000 చొప్పున ఇస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం ప్రకటించారు.
ఇవీ చదవండి : ఆ రాష్ట్రంలో భారీగా లిథియం నిక్షేపాలు.. కశ్మీర్ కంటే అధికం!
'వారంతా కచ్చితంగా JIO సిమ్ వాడాల్సిందే'.. ప్రభుత్వం కీలక ఆదేశాలు