ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. ఇజ్రత్ గంజ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ భవనం కుప్పకూలిపోయింది. ముగ్గరు మృతి చెందారు. దాదాపు 15 నుంచి 20 మంది శిథిలాల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్లో 7 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించిన 15 నుంచి 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటివరుకు 8 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే, ఆ అపార్ట్మెంట్ బేస్మెంట్లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉత్తరాదిలో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలోనే భవనం కూలిపోయినట్లు సమాచారం.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవనం కుప్పకూలినట్లు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పతక్ ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అర్బన్ డెవెలప్మెంట్ అధికారి ఏకే మిశ్ర, అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు.