ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో అలయా అపార్ట్మెంట్ కుప్పకూలిన ప్రాంతంలో 18 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటివరకు 16 మందిని సురక్షితంగా కాపాడారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం. అయితే లఖ్‌నవూ డెవలప్మెంట్ అథారిటీ నిర్లాక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు అంటున్నారు. నాలుగు అంతస్తుల ఈ అపార్ట్మెంట్ పిల్లర్లను చాలా సన్నగా, నాసిరకంగా నిర్మించారని ఆరోపిస్తున్నారు. భవనం కూడా సరైన ప్రణాళిక లేకుండానే నిర్మించినట్లు చెబుతున్నారు.
తల్లి, భార్యను కోల్పోయిన ఎస్పీ నేత..
బుధవారం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో శిథిలాల కింద చిక్కుకున్న సమాజ్‌వాదీ పార్టీ నేత అబ్బాస్ హైదర్ భార్య బేగం హైదర్, ఉజ్మాను అధికారులు బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. దీంతో అబ్బాస్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
'మొత్తం పోయింది.. కూతురికి పెళ్లి చేసదెలా?'
అపార్ట్మెంట్ కుప్పకూలిన ఘటనలో విద్యుత్ శాఖ ఉద్యోగి రంజనా అవస్థి.. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. "నేను విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఏడాదే పదవీ విరమణ పొందుతున్నాను. మొత్తం సంపాదించినదంతా పోయింది. మరికొద్ది నెలల్లో కుమార్తె పెళ్లి చేద్దామనుకున్నాను. ఇప్పుడు ఇల్లు లేదు. డబ్బు లేదు. ఏం చేయాలో అర్ధం కావట్లేదు" అని రంజన వాపోయింది.
శిథిలాల కింద తల్లిదండ్రులు.. ఆస్పత్రిలో ఆరేళ్ల చిన్నారి
రెస్క్యూ ఆపరేషన్‌లో ఓ ఆరేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడింది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం.. శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే చిన్నారి కోలుకున్నాక తల్లిదండ్రుల కోసం అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదని ఆమె మామయ్య.. ఈటీవీ భారత్‌తో తెలిపాడు.
15 మంది ప్రాణాలు కాపాడిన సాంకేతికత..
అలయా అపార్ట్మెంట్ కుప్పకూలిన తర్వాత శిథిలాల్లో చిక్కుకున్న ప్రజలను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. దీంతో రోబోటిక్స్ నిపుణుడు మిలింద్రాజ్ను అధికారులు పిలిపించారు. వెంటనే అతడు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించాడు. ఆ తర్వాత అతడు తన ల్యాబ్‌కు వెళ్లిపోయాడు. సుమారు మూడు గంటలపాటు కష్టపడి అధిక సెన్సిటివ్ ఆడియో రిసీవర్‌ను తయారు చేశాడు. అది చిన్నపాటి ధ్వనిని కూడా గుర్తించగలదు. అనంతరం ఆ రిసీవర్‌ను తీసుకుని మిలింద్ రాజ్ ఘటనాస్థలికి వచ్చాడు. చిక్కుకున్న వ్యక్తులను గట్టిగా అరవమని చెప్పాడు. అలా లొకేషన్‌ను గుర్తించి బాధితులు ఎక్కడున్నారో చెప్పింది ఆ రిసీవర్. దీంతో 15 మందిని కాపాడారు అధికారులు.
బిల్డర్‌పై కేసు నమోదు..
బుధవారం ఉదయం ఘటనాస్థలికి డివిజినల్ కమిషనర్ డా.రోషన్ జాకబ్ చేరుకుని పరిశీలించారు. భవన యజమాని మహ్మద్ తారిఖ్, నవాజీశ్ షాహిద్‌తో పాటు బిల్డర్ యజ్దాన్పై కేసు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లఖ్‌నవూలో ఇతర భవనాలను గుర్తించి దర్యాప్తు చేయాలని, అక్రమ నిర్మాణాలు జరిగితే వాటిని కూల్చివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. నవాజీశ్ను మంగళవారం అర్థరాత్రి మీరట్‌లోని అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది..
మంగళవారం సాయంత్రం 06.30 గంటల ప్రాంతంలో హజ్రత్‌గంజ్‌లోని నాలుగు అంతస్తుల అలయా అపార్ట్మెంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అపార్ట్మెంట్లో 12 ఫ్లాట్లు ఉండగా.. 10 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.