BSF Orders Special Airlift For Jawan: జమ్ముకశ్మీర్‌లోని ఓ జవాన్ పెళ్లి కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ను నడిపింది సైన్యం. మచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద నారాయణ బెహెరా అనే వ్యక్తి బీఎస్‌ఎఫ్ సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మే 2న ఒడిశాలోని తన గ్రామంలో వివాహం జరగనుంది. అయితే అతడు ఉన్న ప్రదేశం కశ్మీర్ లోయలో ఉన్నందున ఆ ప్రాంతమంతా మంచుతో నిండిపోయింది. రహదారి సంబంధం పూర్తిగా తెగిపోయింది.
నారాయణ ఉన్న ప్రదేశం ఎత్తైనది కావడం వల్ల 2,500 కిలోమీటర్ల దూరంలో జరిగే వివాహానికి హజరయ్యేది అనుమానంగా ఉందని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. కుమారుడు వచ్చేలా చూడాలని కోరారు. అయితే ఈ ప్రదేశాలలో మోహరించిన సైనికులకు వైమానిక దళంతో మాత్రమే రవాణా మార్గం సాధ్యమవుతుందని సరిహద్దు భద్రతా దళానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. దీంతో అతడ్ని తరలించడానికి ప్రత్యేక హెలికాప్టర్‌ను వినియోగించినట్లు ఆయన చెప్పారు.
నారాయణ విషయం తెలుసుకున్న బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్.. శ్రీనగర్‌లో ఉన్న చిరుత హెలికాప్టర్‌లో బెహెరాను తరలించాలని ఆదేశించారు. దీంతో గురువారం తెల్లవారుజామున బెహరాను హెలికాప్టర్‌లో ఎక్కించుకుని శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అతడు ఒడిశా దెంకనల్ జిల్లాలోని ఆదిపూర్ గ్రామంలోని తన ఇంటికి బయలుదేరాడు. సైనికుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని, అందుకే ప్రత్యేక హెలికాప్టర్‌ను నడిపినట్లు ఐజీ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఈశాన్య రాష్ట్రాల్లో ఆ చట్టం ఎత్తివేత: ప్రధాని మోదీ