జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లాలో భారత్-పాక్ సరిహద్దులో మరో సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) శనివారం గుర్తించాయి. హీరానగర్ సెక్టార్లో బార్డర్ ఔట్‌పోస్ట్(బీఓపీ) పన్సార్ ప్రాంతంలోని అభియల్-దోగ్రా, కింగ్రే-దె-కోఠేకు ఎదురుగా ఈ రహస్య సొరంగాన్ని కనుగొన్నట్టు రక్షణ ప్రతినిధి తెలిపారు.
అంతకముందు జనవరి 13న ఇదే ప్రాంతంలోని బాబియాన్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనూ 150 మీటర్ల పొడవైన ఓ సొరంగాన్ని గుర్తించారు. ఫలితంగా పదిరోజుల వ్యవధిలోనే ఇది రెండోది కాగా.. ఆరు నెలల్లో నాలుగోది. అయితే.. గత పదేళ్లలో పదో సొరంగంగా నిలిచింది.
ప్రస్తుతం బయటపడ్డ రహస్య సొరంగం సుమారు 150 మీటర్ల పొడవు, 3 అడుగుల వ్యాసంతో 30 అడుగుల లోతువరకు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో ఇదే ప్రాంతంలో.. పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకెళ్తున్న ఓ పాకిస్థానీ హెక్సాకాప్టర్‌ను ధ్వంసం చేసింది బీఎస్ఎఫ్.
ఇదీ చదవండి: ఈనెల 24న భారత్-చైనా కమాండర్ల 9వ దఫా భేటీ