Brutal Murder in Medchal District: హత్య ఓ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడకు చెందిన యువకుడు హరీశ్.. గత ఎనిమిది నెలల క్రితం అమీర్‌పేట్ నుంచి సూరారం ప్రాంతానికి నివాసం మార్చారు. మేడ్చల్ జిల్లా సూరారంలో స్థలం కొనుగోలు చేసి హరీశ్ తన తల్లితో పాటు అదే ప్రాంతంలో అద్దెకు ఉంటూ ఇంటి నిర్మాణం చేపట్టాడు. హరీశ్‌కు జియాగూడకు చెందిన మనీషా అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారి ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.
Brutal Murder in Medchal: వారు యువకుడిని.. యువతి జోలికి రావద్దంటూ హెచ్చరించారు. అప్పటి నుంచి యువతితో హరీశ్ దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే ఇటీవల తిరిగి మళ్లీ ఇద్దరు కలిశారు. ఈ క్రమంలో హరీశ్ కుటుంబం అమీర్‌పేట్ నుంచి సూరారం ప్రాంతానికి తరలి వెళ్లింది. రెండు రోజుల క్రితం మనీషా కనిపించడం లేదంటూ యువతి బంధువులు హరీశ్ సోదరికి ఫోన్ చేశారు. తమకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చింది.
గత శుక్రవారం కొందరు హరీశ్ ఉంటున్న సూరారం ప్రాంతానికి చేరుకుని.. హరీశ్ ఫొటో స్థానికులకు చూపించి అతడు ఎక్కడుంటున్నాడని ఆరా తీసినట్టు స్ధానికులు తెలిపారు. గత రెండు రోజుల కిందట హరీశ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొందరు అతన్ని అడ్డగించి దారుణంగా కత్తులతో నరికి అంతమొందించారు. ఈ విషయం తెలిసిన హరీశ్ తల్లి, సోదరి, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. యువతితో సహా హరీశ్ హత్య కేసు నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. యువతి సోదరులు ఇతర బంధువులంతా కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వారు ఆరోపిస్తున్నారు.
మా అమ్మకు చెప్పి లాస్ట్ బుధవారం జాబ్‌కి వెళ్లాడు. మేమందరం అలానే అనుకున్నాము. సాయంత్రం 4 గంటల వరకు ఫోన్ ఆన్‌లోనే ఉంది. 4 గంటలకు మా మేనత్త ఫోన్ చేసి ఎక్కడున్నావ్ రా అని అడిగితే.. సికింద్రాబాద్‌లో ఉన్నానని చెప్పాడు. సాయంత్రం 6 గంటలకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వచ్చినా మేము భయపడలేదు. ఎందుకంటే ఆయన ఒక వారం, 10 రోజులు వెళ్లినా కూడా ఫోన్ ఆఫ్‌లో పెట్టుకుంటాడు.-బాధితుడి కుటుంబసభ్యురాలు
మరోవైపు ఒక్కగానొక్క కుమారుడు హత్యకు గురికావడంతో హరీశ్ తల్లి బోరున విలపిస్తోంది. హరీశ్ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: