BRS Leaders Demanded Change Party Name : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా మార్చాలని ఆ పార్టీ శ్రేణులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా నిర్వహిస్తున్న లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో(Lok Sabha Elections Preparatory Meetings) జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి విశ్లేషణలను కొనసాగిస్తూనే, మరోవైపు ఎక్కువ మంది పార్టీ నాయకులు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విన్నవిస్తున్నట్లు తెలిసింది. తాజాగా బుధవారం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి - పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
మళ్లీ తెర మీదకి టీఆర్ఎస్ : 'తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉంది. పార్టీ పేరులో తెలంగాణను తొలగించి, భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. బీఆర్ఎస్ తమది కాదనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది. కనీసం 1-2 శాతం ప్రజల్లో ఆ భావన ఏర్పడినా, మన పార్టీకి ఆ మేరకు ఓట్లు దూరమయ్యాయనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. బీఆర్ఎస్గా మారిన తర్వాత అంతగా కలిసి రాలేదనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని మాతో ప్రస్తావిస్తున్నారు.
పార్టీకి వరమైన తెలంగాణ సెంటిమెంట్‌ను దూరం చేసుకోవద్దు. తిరిగి టీఆర్ఎస్‌గా మారిస్తే బాగుంటుంది. ఇది మెజారిటీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం. ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే, దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటివారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుంది. అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకెళ్లాలి.' అని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రతిపాదించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక - పార్టీ వాణి బలంగా వినిపించే వారికే బీఆర్ఎస్ ఛాన్స్!
Convert BRS Back to TRS : టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో, లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మీదనే పోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పేరు మార్చాకే పార్టీకి కష్టాలు వచ్చాయంటున్నారు. పార్టీలో ఎప్పుడైతే తెలంగాణ పేరు తీసేశారో, అప్పటి నుంచే ప్రజల్లో గుర్తింపు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. అందుకే మళ్లీ జనంలో సెంటిమెంట్ రావాలంటే, బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాల్సిందేనని కోరుతున్నారు. గులాబి దళపతి మరీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మారుస్తారా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.
జోరుగా బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు - పార్టీ శ్రేణుల అభిప్రాయాలపై అధినేత కేసీఆర్ అధ్యయనం