BRS General Body Meeting at Telangana Bhavan: భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత జరుగుతున్న బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు.
అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88సీట్లు గెలిచామని... వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదని... మునుపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలనేది ప్రాధాన్యతాంశమని కేసీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గం వారిగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని... 'పల్లె నిద్ర' వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలన్నారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.
అబ్ కి బార్ కిసాన్ సర్కార్: తెలంగాణ రాష్ట్ర సాధించిన పంథాలోనే దేశాన్ని ప్రగతిపథంలో నిలిపేందుకు బీఆర్ఎస్ ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించిన పంథాలోనే 'అబ్ కి బార్ కిసాన్ సర్కార్' నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటేసి తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకుందని కేసీఆర్ చెప్పారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశు, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందన్నారు.
తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు: మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువని... అక్కడి ప్రభుత్వానికి విజన్ లేదన్నారు. ఏపీ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా లక్ష రూపాయలు తక్కువగా ఉన్నాయని... తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవీ చదవండి: