ప్రతి అమ్మాయి తన జీవితంలో మధురమైన క్షణాలుగా భావించే వాటిలో పెళ్లి ఒకటి. ఆ సమయంలో పెళ్లి మండపానికి ఎలా వెళ్లాలి. ఏ దుస్తులు ధరించాలి.. ఇలా ప్రతీ విషయానికి కొన్ని వారాల ముందే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఏం చేసినా అందరి దృష్టి ఆకర్షించేలా, వీలైనంత గ్రాండ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే బారాత్‌లో డ్యాన్సులు వేయడం, అప్పటి క్షణాలకు తగిన ఓ పాటతో పెళ్లి మండపానికి ఎంట్రీ ఇవ్వడం వంటివి ట్రెండ్‌గా మారాయి. ఈ ట్రెండ్‌నే ఫాలో అవుదాం అనుకుంది ఓ నవ వధువు. పెళ్లి మండపానికి తను ఇచ్చిన ఎంట్రీ.. మరపురాని క్షణాలు అవ్వాలనుకుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయించుకుంది.
ఆ పాటతోనే రావాలని..
శివానీ పిప్పెల్ అనే ఈ వధువు.. 'పియా మోహే ఘర్ ఆయే..' అంటూ సాగే ఓ హిందీ పాటతో మండపంలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. తీరా అక్కడికి చేరుకునే సరికి తను చెప్పిన పాట కాకుండా వేరే పాట ప్లే అయింది. దీంతో అప్పటివరకు ఆమెలో ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా పోయింది. తను ఎంచుకున్న పాటతో మండపం వద్దకు వెళ్లాలని అక్కడికి ఎంతో ఆశతో వచ్చానని.. కానీ అక్కడ వేరే పాటను పెట్టడం తనకు ఎంతో నిరాశ కలిగించిందని బంధువుల ముందు వాపోయింది. అలిగి.. ఆ పాట పెడితే కానీ అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పేసింది. వధువుకు సర్దిచెప్పిన బంధువులు.. అక్కడ ఉన్న డీజేలో ఆమె ఎంచుకున్న పాటను పెట్టించారు. దీంతో పెళ్లికూతురి ముఖం మళ్లీ వికసించింది. మండపానికి చేరుకుని.. వరుడుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోను మొదట వధువు తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ తర్వాత దీనిని 'ది వెడ్డింగ్ బ్రైడ్' అనే ఇన్‌స్టా పేజ్ షేర్ చేయడం వల్ల ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన నెటిజన్లు వధువుకు మద్దతుగా కామెంట్లు పెట్టసాగారు. వధువు బాధ తాము అర్థం చేసుకోగలమని.. ఎంతో ఆర్భాటంగా ప్లాన్ చేసుకున్నాక ఇలా జరిగితే చాలా కష్టంగా ఉంటుంది అని పేర్కొన్నారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని ఓ యూజర్ కామెంట్ చేశారు.
ఇదీ చదవండి : 'మిస్ ఇండియా ఇంటర్నేషనల్'గా జోయా అఫ్రోజ్