తరతరాలుగా వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా ఓ జంట వివాహం చేసుకుంది. తనూజ, శార్దూల్ కదం అనే వధూవరులు ఒకరికొకరు మంగళసూత్రాలను కట్టుకొన్న ఈ వింత ఘటన మహారాష్ట్ర పుణెలో వెలుగులోకి వచ్చింది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమేనని, లింగ సమానత్వాన్ని చాటేందుకే తానీ నిర్ణయం తీసుకున్నానంటున్న ఆ యువకుడిని సామాజిక మాధ్యమాల్లో కొందరు ట్రోల్ చేస్తుండగా.. మరికొందరు శెభాష్ అంటూ మెచ్చుకొంటున్నారు. అసలేం జరిగిందో 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'తో శార్దూల్ ఇలా వివరించాడు.
![exchanged mangalsutras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11668903_33.jpg)
‘‘తనూజ నేనూ ఒకే కాలేజీలో చదువుకున్నాం. కానీ అప్పట్లో ఒకరితో ఒకరం మాట్లాడుకోలేకపోయినా.. నాలుగేళ్ల తర్వాత చాలా అనూహ్యంగా కలిశాం. తను హిమేష్ రేషేమియా సాంగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. 'టార్చర్' అని క్యాప్షన్ ఇచ్చింది. దానికి నేను 'మహా టార్చర్' అని రిప్లై ఇచ్చాను. అలా మా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. కొన్నివారాల తర్వాత తనూజ టీ తాగుదామా అని అడిగింది. అలా మా ఇద్దరం కలిశాం. వర్క్, సినిమాలు, భవిష్యత్తు ప్రణాళికలు.. ఇలా అనేక విషయాలు మేం మాట్లాడుకున్నాం. ఆ క్రమంలోనే స్త్రీవాదం (ఫెమినిజం) గురించి చర్చకు వచ్చినప్పుడు.. 'నేను హార్డ్ కోర్ ఫెమినిస్ట్‌ని' అని కచ్చితంగా చెప్పాను. నేను అలా అంటానని ఊహించనట్టుగా ఆమె నావైపు చూసింది. అప్పట్నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.
వర్క్ అయిపోయాక ఇద్దరం కలుసుకొనేవాళ్లం. ఒకరోజు నా పుట్టిన రోజున తను హ్యాండ్ మేడ్ కార్డ్ ఇచ్చింది. ఆ రోజు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేశాను. రెండు రోజుల తర్వాత తను కూడా నేనంటే ఇష్టమేనంది. ఆతర్వాత డేటింగ్ మొదలైంది. ఇద్దరం ప్రేమలో పడ్డాం. మా తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడానికి ముందు ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్నాం. వాళ్లు ఆశ్చర్యపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్నప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
మహిళలే మంగళసూత్రం ఎందుకు కట్టుకోవాలి? అని తనూజతో ఒకరోజు అన్నాను. స్త్రీ, పురుషులు సమానమే కదా.. అలా చేయడంలో అర్థంలేదని వాదించాను. పెళ్లి రోజున నేనూ మంగళసూత్రం ధరిస్తానని చెప్పాను. దీంతో నా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలా చేస్తున్నావని కొందరు బంధువులు అడిగితే సమానత్వం కోసమని చెప్పా. కొన్ని కారణాల వల్ల అమ్మాయి బంధువులే అన్ని ఖర్చులూ భరించాలి. కానీ నేను తనూజ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఖర్చుల్ని సరి సమానంగా పెట్టుకుందామని చెప్పా. పెళ్లికి ముందు రోజు అనుకుంటా.. మంగళసూత్రం ఒక్కరోజే వేసుకుంటావా? ప్రతిరోజూనా? అని తనూజ నన్నడిగింది. ప్రతి రోజూ వేసుకుంటానని చెప్పా. పెళ్లి వేడుక జరిగేటప్పుడు నేనూ తనూజ మంగళసూత్రాలు కట్టుకున్న సందర్భంలో ఎంతో సంతోషించాను. నేను చేసిన పనిపట్ల కొందరు బంధువులు సంతోషంగా లేనప్పటికీ మమ్మల్ని ఏమీ అనలేకపోయారు."
-శార్దూల్ కదం, వరుడు
"కానీ పెళ్లి తర్వాత రోజు మాత్రం ఇంటర్నెట్‌లో మా ఇద్దరిపైనా భయంకరమైన ట్రోల్స్ వచ్చాయి. మీడియాలో రావడంతో అనేకమంది కామెంట్లు చేయడంమొదలు పెట్టారు. ఇప్పుడు చీర కూడా కట్టుకో అంటూ ఎగతాళి చేశారు. కొందరు ఉదారవాదులు కూడా లింగ సమానత్వానికి మద్దతు తెలిపేందుకు ఇది దారి కాదంటూ నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. నేను చేసిన పనికి ట్రోల్స్ వస్తాయని ఊహించినప్పటికీ.. ఇంతలా వస్తాయని మాత్రం అనుకోలేదు. మొదట్లో తనూజ కొంత ప్రభావితమైనప్పటికీ ఆ తర్వాత వాటిని పట్టించుకోవడంలేదు. ఎందుకంటే మా ఇద్దరి బంధాన్ని ఇంకెవరూ నిర్వచించలేరు. పనిలో ఒకరికొకరు సహకరించుకుంటూ.. ఒకరి కలల్ని ఒకరు విశ్వసించుకుంటూ కలిసి మా ప్రయాణం సాగిస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచం ఏమనుకుంటుందో ఎవరు పట్టించుకుంటారు?" అంటూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు శార్దూల్.
![exchanged mangalsutras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11668903_11.jpg)
![exchanged mangalsutras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11668903_22.jpg)
లైకుల వరద..
శార్దూల్, తనూజల ప్రేమ, పెళ్లి వ్యవహారం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 82వేలకు పైగా లైక్‌లు రాగా.. ఫేస్‌బుక్‌లో వేలాది మంది లైకులు కొడుతున్నారు. శార్దూల్ నిర్ణయం గర్వకారణమంటూ కొందరు నెటిజన్లు ఆ జంటను ఆశీర్వదిస్తున్నారు. ఆ జంట ఆనందంగా ఉండాలంటూ ప్రార్థిస్తున్నారు. "వరుడి అభిప్రాయాలను గౌరవిస్తున్నా. అతడు తప్పు చేశాడని మాత్రం అనుకోవడంలేదు. సమానత్వానికి ప్రతీకగా మంగళసూత్రం ధరించడం ద్వారా తన ఆలోచనను ఆవిష్కరించాడు" అంటూ ఓ నెటిజన్ ప్రశంసించాడు.
ఇదీ చూడండి: అమ్మ నగలు తనఖా పెట్టి.. కొవిడ్ ఆస్పత్రి నిర్మాణం!
ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రిలో కార్టూన్ల సందడి