2021లో తొలి అంతరిక్ష ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(పీఎస్ఎల్వీ) సీ-51 రాకెట్ ద్వారా బ్రెజిల్ ఉపగ్రహం అమెజానియా-1 సహా.. మూడు ఇండియన్ పేలోడ్స్ నింగిలోకి పంపనుంది ఇస్రో. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శివన్.. సమీప భవిష్యత్‌లో చేపట్టనున్న మిషన్ ఎంతో గొప్పదన్నారు. దేశానికే ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు.
ఈ మిషన్‌లో ప్రయోగించనున్న ప్రధాన పేలోడ్ అమెజానియా-1 అని తెలిపిన ఇస్రో.. భూమిని పరిశీలించడానికి బ్రెజిల్ అభివృద్ధి చేసిన తొలి శాటిలైట్ అని పేర్కొంది. భారత్‌కు చెందిన మరో మూడు ఉపగ్రహాలు.. 'ఆనంద్', 'సతీశ్ ధావన్', 'యూనిటీశాట్' పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవని తెలిపింది. 'ఆనంద్'ను భారత్‌కు చెందిన అంతరిక్ష స్టార్టప్ పిక్సెల్ రూపొందించగా.. 'సతీశ్ ధవన్ శాటిలైట్'ను చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా నిర్మించింది. 'యూనిటీశాట్'ను జెప్పియార్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీపెరుంబుదూర్(జిట్‌శాట్), జీహెచ్ రైసోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నాగ్‌పుర్(జీహెచ్‌ఆర్‌సీఈశాట్), శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కోయంబత్తూర్(శ్రీ శక్తి శాట్) సంయుక్తంగా రూపొందించాయి.
ఇదీ చూడండి: సభాముఖంగా సాగు చట్టాలపై మోదీ ప్రసంగం!