కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎంతోమంది తమలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. అదే కోవకు చెందుతాడీ కర్ణాటక విద్యార్థి. పదో తరగతి చదువుతున్న అన్ష్ రావు.. వ్యర్థ పదార్థాలను సేకరించి, సోషల్ మీడియా సాయంతో ఏకంగా ఓ వాహనాన్నే రూపొందించాడు. ఇంజిన్, గేర్లు లేకుండా తయారైన ఈ కారును విద్యుత్ శక్తితో నడిచేలా ఆవిష్కరించాడు.
కారు ప్రత్యేకతలివే..
బెల్గాంలోని జాదవ్ నగర్‌కు చెందిన అన్ష్ రావు.. తన చిన్న నాటి నుంచే సొంతంగా ఓ కారును తయారుచేయాలని అనుకునేవాడు. లాక్డౌన్ సమయంలో తన కలల్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాడు. గూగుల్, యూట్యూబ్‌ల సాయంతో తన సృజనాత్మకతను పదును పెట్టే.. రకరకాల వీడియోలను చూశాడు. ఆ సమాచారానికి తన ప్రతిభా నైపుణ్యాలను జోడించి ఓ ఎలక్ట్రిక్ కారును రూపొందించాడు. 12 వాట్ల బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ వాహనం 4 గంటల ఛార్జింగ్‌తో సుమారు 70కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గేర్లు లేకుండా నడిచే ఈ కారులో రివర్స్ సౌకర్యం కల్పించడం అన్ష్లోని ఆవిష్కరణ కోణాన్ని చాటుతోంది. అంతేకాకుండా సైడ్ మిర్రర్లకు బదులుగా భద్రత కోసం అమర్చిన ఫ్రంట్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కల సాకారమయ్యేందుకు కష్టపడ్డాడిలా..
తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సాధించడం కోసం బాగానే కష్టపడ్డాడు అన్ష్. పాత టైర్లు, డోర్, బొనేట్ వంటి ముడి సరకును సేకరించి.. వెల్డింగ్ సాయంతో వాటిని అనుసంధానం చేసుకున్నాడు. పెద్ద వ్యాపారవేత్త అయిన తండ్రి వినాయక్... అన్ష్ ప్రయోగాల కోసం పెట్టుబడి పెట్టేందుకు తొలుత నిరాకరించాడు. ఆ తర్వాత తన కొడుకు పడుతున్న కష్టాలను చూసి రూ.10 వేలు ఇచ్చాడు. ఆ సొమ్ముతో కారు తయారీకి అవసరమైన పరికరాలను కొనుగోలు చేశాడు. వినాయక్ మిత్రుడి సాయంతో సేకరించిన చిన్న ప్రదేశంలో.. తన ప్రయోగాలు చేసేవాడు అన్ష్. ఇలా అనేక కష్టాల అనంతరం... తన కలను సాకారం చేసున్నాడీ విద్యార్థి.
మరో రెండు వారాల్లో ఈ కారు మార్కెట్లోకి రానుంది. దీని అంచనా ధర రూ.1.20 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: తొమ్మిదో తరగతి చిన్నారి గొప్ప ఆవిష్కరణ..