"మా అమ్మ నాకు కాటుక పెడుతోంది. నా చాక్లెట్లు దొంగతనం చేస్తోంది. ఆమెను జైల్లో పెట్టండి" మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ జిల్లా దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ చేసిన ఫిర్యాదు ఇది. ఇంతకీ విషయం ఏమిటంటే.. సద్దామ్‌కు వాళ్ల అమ్మ తల స్నానం చేయించాక కాటుక పెడుతుంటుంది. కాటుక పెట్టించుకోవడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో వద్దని అల్లరి చేయడంతో తల్లి ముద్దుగా చెంప మీద ఓ దెబ్బ కొట్టింది. అంతే సద్దామ్ కోపం కట్టలు తెంచుకుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళదాం వస్తావా? రావా? అంటూ తండ్రి దగ్గరకు వెళ్లి ఒకటే ఏడుపు మొదలు పెట్టాడు. చేసేదేం లేక కుమారుడిని వెంటబెట్టుకుని తండ్రి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు.
అక్కడ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రియాంకా నాయక్‌కు సద్దామ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. చిన్నారి తీరుతో ఒక్కసారి గట్టిగా నవ్వేసిన ఆమె.. మోకాళ్లపై కూర్చుని సద్దామ్ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. సద్దామ్ గోడునంతా తెల్ల కాగితంపై రాశారు. అనంతరం సంతకం కూడా తీసుకున్నారు. అప్పటికి కానీ.. చిన్నారి కోపం తగ్గలేదు. ఫిర్యాదు తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌కు మూడేళ్ల సద్దామ్ ముకుళిత హస్తాలతో నమస్కారం చేసి ధన్యవాదాలు తెలిపాడు.