Borewell Boy died: మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలో బర్ఖేడా గ్రామంలో బోరుబావిలో పడిన ఓ మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆ బాలుడిని రక్షించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఊపిరాడకపోవడం వల్ల బోరుబావిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలో నాలుగు రోజుల్లోనే ఇది రెండో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
తండ్రితో వెళ్లి.. తనువు చాలించి..
తన తండ్రితో పొలానికి వెళ్లిన ప్రిన్స్ ఆత్యా అనే బాలుడు ఆడుకుంటూ పొరపాటున 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. పొలాల్లో పని చేస్తున్నవారు ఇది గ్రహించి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది.. 30 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు ఆ బాలుడిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. భారీ యంత్రాల సాయంతో మట్టిని తవ్వారు. ఐదు గంటలపాటు శ్రమించి.. ప్రిన్స్ బయటకు తీశారు. వెంటనే సమీపంలో ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రిన్స్ మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. బయటకు తీయడానికి రెండు గంటల ముందే.. ఊపిరాడక చనిపోయినట్లు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రిన్స్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం నాలుగేళ్ల బాలుడు
అదే రాష్ట్రంలో ఉమరియా జిల్లాలో నాలుగురోజుల క్రితం (గురువారం) ఇటువంటి ఘటనే జరిగింది. బోరుబావిలో పడిన బాలుడిని కాపాడేందుకు అధికారులు 16 గంటలు శ్రమించినా.. ఫలితం లేకపోయింది. వారు బయటకు తీసినప్పటికే ఆ బాలుడు మరణించాడు.
రాజస్థాన్లోనూ..
రాజస్థాన్ సీకర్ జిల్లాలో.. 50 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన నాలుగున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు దక్కాయి. 24 గంటలకుపైగా శ్రమించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని బయటకు తీశాయి. బోరుబావికి సమాంతరంగా.. ఓ సొరంగం తవ్వి ఆపరేషన్లో సఫలం అయినట్లు వెల్లడించారు. ఆ బాలుడ్ని వెంటనే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చిన్నారి.. వీడియో వైరల్!