Booster dose in India: కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' వ్యాప్తి భయాల నేపథ్యంలో దేశంలోనూ కరోనా టీకా బూస్టర్('ప్రికాషన్') డోసు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశ ప్రజలనుద్దేశించి శనివారం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రికాషన్ డోసులతో పాటు, చిన్నారులకు కరోనా టీకా పంపిణీ అంశంపైనా స్పష్టత ఇచ్చారు.
ఏంటీ బూస్టర్ డోసు?
What is booster dose: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా ఇచ్చే డోసునే బూస్టర్ డోసు అంటారు. మూడో డోసు వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. కరోనా వైరస్ను సమర్థంగా అడ్డుకుంటుంది. మూడో డోసు తీసుకుంటే కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏఏ దేశాల్లో పంపిణీ చేస్తున్నారు?
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. జర్మనీ, ఆస్ట్రియా, కెనడా, అమెరికా వంటి దేశాలు మూడో డోసు అందిస్తున్నాయి. ఎక్కువ బూస్టర్ డోసులు అగ్రరాజ్యంలోనే పంపిణీ అయ్యాయి.
మన దేశంలో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు?
మన దేశంలోనూ మూడో డోసు పంపిణీ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 10 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుజాగ్రత్త (ప్రికాషన్) డోసు పేరుతో దీన్ని పంపిణీ చేయనున్నారు.
ఎవరికి ఇస్తారు?
Who will get Booster dose india: మూడో డోసు ప్రారంభంలోనే అందరికీ అందుబాటులో ఉండదు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి ముందుగా ప్రికాషన్ డోసు అందిస్తారు. వైద్యుల సలహా మేరకు పంపిణీ చేస్తారు. అనంతరం, ఇతర వయసుల వారికీ దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎన్నిరోజులకు తీసుకోవాలి?
booster dose gap: రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ఈ మేరకు కాలవ్యవధిపై సమాలోచనలు చేస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మూడో డోసుగా ఏ టీకాను వేస్తారు?
దేశంలో చాలా వరకు ప్రజలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ తమ ప్రధాన టీకాలుగా తీసుకున్నారు. అయితే, తొలిసారి తీసుకున్న టీకాలనే.. మూడో డోసుగా తీసుకోవాల్సి ఉంటుందా? అనే విషయంపై సందేహం నెలకొంది. ముందుగా తీసుకున్న టీకా కాకుండా ఇతర టీకా డోసులనే ప్రికాషన్ డోసుగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. లబ్ధిదారుడు ఒకే టీకాకు చెందిన మూడు డోసులను తీసుకునే అవకాశం ఉండదని చెప్పాయి. దీనిపై త్వరలోనే కేంద్ర వైద్య శాఖ 'బ్లూప్రింట్' విడుదల చేయనుందని వివరించాయి.
దేశ జనాభాలో 61శాతం మంది వయోజనులకు టీకా రెండు డోసులూ అందాయి. 90శాతం పైగా వయోజనులకు కనీసం ఒక డోసు అందింది. మొత్తంగా 141 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చదవండి: