Abhishek Bachchan Politics : బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తనయుడు, స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. అది కూడా ఆయన తండ్రి పోటీ చేసి గెలిచిన స్థానం నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సమాజ్‌వాది పార్టీ తరఫున ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ పార్లమెంట్ స్థానం నుంచి అభిషేక్ పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ వార్తలపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
ఆయన కోరిక మేరకు 1984లో..
అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు.. 1984లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. లోక్ దళ్ నాయకుడు హేమ్వతి నందన్ బహుగుణపై ఒక లక్ష 9వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా, అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కూడా ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తరఫున యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. అభిషేక్ బచ్చన్ తల్లిదండ్రులు ఇద్దరూ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ను కూడా తమ పార్టీ తరఫున ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ ఎంపీ స్థానంలో నిలబెట్టాలని సమాజ్‌వాది పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ సీటును గత కొంతకాలంగా పలు రాజకీయ పార్టీలకు అడ్డాగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన రీటా బహుగుణ జోషి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆమె విజయం తర్వాత యూపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె కుమారుడు మయాంక్ జోషి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటా బహుగుణ జోషికి 2024 సార్వత్రిక పోరులో బీజేపీ.. ప్రయాగ్‌రాజ్ టికెట్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Abhishek Bachchan Akhilesh Yadav : ఇదిలా ఉండగా.. అభిషేక్ బచ్చన్‌ను ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు సమాజ్‌వాద్ పార్టీ ఆసక్తి చూపతున్నట్లు తెలుస్తోంది. అభిషేక్‌ను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపితే.. ఆయన ఛరిష్మాతో పాటు అమితాబ్ అభిమానుల ఓట్లను కొల్లగొట్టొచ్చని ఎస్పీ ఆలోచన అని సమాచారం.