అసోంలోని మజూలి-నిమాటిఘాట్ మధ్య ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ఒక ఫెర్రీని పడవ ఢీకొట్టింది. వెంటనే పడవ బోల్తా కొట్టగా... అందులోని వారు నదిలో పడిపోయారు.
ఇదీ జరిగింది..
ప్రైవేటు పడవ 'మా కమలా' నిమాటి ఘాట్ నుంచి మజూలి వెళ్తోంది. మజూలి నుంచి ప్రభుత్వ ఫెర్రీ 'త్రిప్కాయ్' వస్తోంది. ఈ క్రమంలో మజూలి-నిమాటిఘాట్ మధ్య ప్రైవేటు బోటు.. ఫెర్రీని ఢీకొట్టి మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 120 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
"బోల్తా పడిన పడవలోని 40 మందిని ఫెర్రీలోని వారు రక్షించారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎంత మంది చనిపోయారనే విషయం ఇంకా తెలియదు. " అని జోర్హాట్ అదనపు డివిజనల్ కమిషనర్ దామోదర్ బర్మన్ తెలిపారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
అసోం పడవ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రయాణికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
సీఎం దిగ్భ్రాంతి..
పడవ ప్రమాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ప్రమాద స్థలికి వెళ్లి సహాయక చర్యల్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని మంత్రి బిమల్ బోరాను ఆదేశించారు. తాను కూడా వెళ్లనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
షా ఆరా..
ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోం సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అవసరమైన సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.