Boat capsized in Chapra : సరయూ నదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా.. మరో 14 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన బిహార్ ఛాపరా జిల్లాలోని మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధి మథీయార్ సమీపంలో జరిగింది. ఇందులో పొలం పనులు ముగించుకుని వస్తున్న రైతులు, కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. చీకటి కావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చెప్పారు.
ఇదీ జరిగింది
దియారా ప్రాంతానికి చెందిన రైతులు, కూలీలు ఉదయాన్నే పొలం పనులు కోసం నది దాటి వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న పడవ సరయూ నదిలో బోల్తా పడింది. వెంటనే సమాచారం అందుకున్న సమీపంలోని గ్రామాల ప్రజలు ఘటనా స్థలికి వచ్చారు. మరోవైపు పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేరుకుని వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ సహాయక చర్యల్లో స్థానిక ప్రజలు కూడా భాగం పంచుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతులను పూల్కుమారి దేవి, తారాదేవి, రమితా కుమారి, పింకీ కుమారిగా గుర్తించారు.
విద్యార్థుల పడవ బోల్తా.. 10 మంది చిన్నారులు గల్లంతు.. మరో 20 మంది..
అంతకుముందు బిహార్లోని ఇలాంటి ఘటన జరిగింది. ముజఫర్‌పుర్ జిల్లాలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడడం వల్ల 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. మధురపట్టి ఘాట్ సమీపంలోని భాగమతి నదిలో బోల్తా పడింది. పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు పడవలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే స్థానికులు నాటు పడవలతో సహాయక చర్యలు చేపట్టి 20 మంది చిన్నారులను ఒడ్డుకు చేర్చారు. విద్యార్థుల్లో కొందరికి ఈత రావడం వల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని స్థానికులు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి గల్లంతైన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన చిన్నారులు గల్లంతు కావడం వల్ల అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
Live Video : అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం.. పడవ బోల్తా పడి మామాఅల్లుళ్లు మృతి