Boat capsize Gujarat: గుజరాత్ సోమ్‌నాథ్ జిల్లాలోని ఉనా తాలుకాలో తీరంలో ఉంచిన పడవలు భారీ ఈదురుగాలుల ధాటికి ధ్వంసమై సముద్రంలో మునిగిపోయాయి. కనీసం ఎనిమిది మంది మత్స్యకారులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 15 పడవలు మునిగిపోయినట్లు తెలుస్తోంది.
Fishermen missing Gujarat Nawabandar:
అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తీరరక్షక దళ సిబ్బందితో కలిసి అత్యవసర చర్యలు ప్రారంభించినట్లు ఉనా తాలుకా రెవెన్యూ అధికారి ఆర్ఆర్ ఖంభ్రా వెల్లడించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
"అర్ధరాత్రి తర్వాత నవబందర్ వద్ద సముద్రం పరిస్థితి మారిపోయింది. భారీ ఈదురుగాలుల వల్ల ఎత్తైన అలలు ఏర్పడ్డాయి. తొలుత 12 మంది మత్స్యకారులు ఆచూకీ కోల్పోయారు. అందులో నలుగురు తీరానికి ఈదుకుంటూ వచ్చేశారు. ఎనిమిది మంది కోసం సహాయక చర్యలు చేపట్టాం."
-ఖంభ్రా, ఉనా రెవెన్యూ అధికారి
కనీసం 10 పడవలు పూర్తిగా ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు. భీకర గాలులకు మరో 40 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. మత్స్యకారులు పడవలలో నిద్రిస్తున్నారని నవబందర్ గ్రామ సర్పంచ్ సోమవార్ మజీతియా వివరించారు. అర్ధరాత్రి తుపాను లాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పారు.
అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా దక్షిణ గుజరాత్, మహారాష్ట్రలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. నవబందర్ ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక్కడ గురువారం సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఇదీ చదవండి: ఈ పాఠశాల కవలలకు కేరాఫ్!