ఆ కుటుంబంలో ఆరుగురు సభ్యులు... అందులో ఐదుగురికి కళ్లు కనిపించవు... కంటి చూపు లేనందున ఈ ఐదుగురు ఎలాంటి పని చేయలేరు... వీరందరికీ భిక్షాటన ఒక్కటే మార్గం... కానీ, వీరి పరిస్థితి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.. ఈ కుటుంబ పరిస్థితిని మార్చేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ పథకాలు సైతం అందని ఈ కుటుంబంలో వెలుగులు నింపారు.
బంగాల్, మాల్దా జిల్లాలోని ఇస్లాంపుర్ గ్రామంలో బబ్లూ హక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పుట్టుకతోనే అతడికి అంధత్వం ఉంది. అతడి సోదరి ఇస్మతారా ఖాతున్ సైతం కంటి చూపు లేకుండానే జన్మించింది. బబ్లూ హక్ ఇద్దరు కుమారులు ఇమ్రాన్, సోలేమాన్, కుమార్తె సబీనాకు సైతం అంధత్వం వచ్చింది. ఈ కుటుంబంలో కంటి చూపు ఉన్నది.. బబ్లూ భార్య షెఫాలీ బీబీకి మాత్రమే. ఈమెనే కుటుంబానికంతా ఆధారం.
"వ్యవసాయం చేసే నా తండ్రి నాకు ఇల్లు కట్టి ఇవ్వడం వల్ల మేమంతా ఇక్కడే ఉంటున్నాం. నా సోదరిని ఎవరూ వివాహం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. మాకు ఇప్పటికీ ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. నా పిల్లలు పెద్ద అవుతున్నారు. మాకు ప్రభుత్వం నుంచి సాయం కావాలి. దీనిపైనే జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి అభ్యర్థించాం."
-బబ్లూ హక్
ఈ కుటుంబ పరిస్థితిపై ఇస్లాంపుర్ గ్రామ పంచాయతీ సభ్యుడు హురున్ రషీద్ స్పందిచాడు. ఆ కుటుంబంలో అందరి వివరాలు పంచాయతీ కార్యాలయంలో సమర్పించారని తెలిపాడు. తాము పంచాయతీ వల్ల సాధ్యమయినంత సహాయం చేస్తామని హామీ ఇచ్చాడు.