దిల్లీ సరిహద్దులోని గాజిపుర్లో(Ghazipur Border News) బారికేడ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టిన క్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులు ఇక తమ పంటలను విక్రయించేందుకు పార్లమెంట్‌కు వెళ్తారని చెప్పారు.
"మేం దిల్లీకి వెళ్లాలని గత 11 నెలలుగా ఇక్కడ కూర్చున్నాం. మమ్మల్ని అనుమతించలేదు. ఇప్పుడు రాకపోకలు ప్రారంభిస్తే అక్కడికి వెళ్తాం. రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు కదా! స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయని పంటను ఇప్పుడు ఎక్కడ విక్రయించాలో రైతులకు చెబుతాం. ముందుగా మా ట్రాక్టర్లు దిల్లీకి వెళ్తాయి"
-- రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
సరిహద్దుల్లో బారికేడ్లను తొలగిస్తున్న నేపథ్యంలో.. నిరసన కార్యక్రమాల విషయమై సంయుక్త కిసాన్ మోర్చా త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తుందని టికాయిత్ చెప్పారు. తదనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు.
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ, రహదారులను నిరవధికంగా దిగ్బంధించలేమని సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు తాజా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
రైతులారా తరలిరండి..
దిల్లీ సరిహద్దులోని గాజిపుర్లో(Ghazipur Border News) బారికేడ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టిన క్రమంలో రైతులు అధికసంఖ్యలో గాజిపుర్కు తరలిరావాలని భారతీయ కిసాన్ యూనియన్ పిలుపునిచ్చింది.
ఇదీ చూడండి: Rahul Gandhi News: 'త్వరలోనే సాగుచట్టాల ఉపసంహరణ'