బంగాల్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల జాబితాపై కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. పాతవాళ్లను కాదని, ఎన్నికల ముందు పార్టీలో చేరినవారికి టికెట్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోల్కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
హేస్టింగ్స్ కార్యాలయం ఎదుట క్యానింగ్ వెస్ట్, కుల్తలీ, జోయ్నగర్, బిష్ణుపుర్ నుంచి వచ్చిన భాజపా కార్యకర్తలు ఉదయం నుంచి చేస్తున్న నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదు రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వచ్చిన అర్ణబ్ రాయ్ తన నామినేషన్ వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అవినీతి చరిత్ర ఉన్న టీఎంసీ నేతలకు భాజపా టికెట్ ఇచ్చిందని, వారిలో కొందరు తమపై దాడులు చేసినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. నామినేషన్లు ఉపసంహరించుకునే వరకు పార్టీ తరఫున ప్రచారం చేసేదిలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఈసీ విధుల్లో అమిత్ షా జోక్యం: మమత