దిల్లీ సరిహద్దులో.. భాజపా కార్యకర్తలకు, సాగు చట్టాల రద్దు కోరుతూ నెలలపాటుగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మధ్య ఘర్షణ జరిగింది. బుధవారం గాజీపుర్ వద్ద జరిగిన ఈ ఘటనలో.. ఇరువర్గాల వారు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు.
భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన అన్నదాతలు సరిహద్దులో ఉద్యమిస్తున్న ప్రాంతంలో.. భాజపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ ఘటనలో.. భాజపా నేత అమిత్ వాల్మీకికి సంబంధించిన కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇది రైతులపై కేంద్రం పన్నిన మరో కుట్ర అని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. భాజపా నేతకు స్వాగతం పలికే ర్యాలీ పేరిట కార్యకర్తలు ఈ గొడవ చేశారని ఆరోపిస్తున్నారు.
"భాజపా కార్యకర్తలు రైతులపై కుట్ర పన్నారు. అన్నదాతలతో తప్పుగా ప్రవర్తించారు. వాహనాలను వారే ధ్వంసం చేసుకుని రైతులను నిందిస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ఆపేందుకు గతంలోనూ ప్రభుత్వం ఇలాంటి విఫలయత్నాలు చేసింది. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు."
--జగ్తార్ సింగ్ బజ్వా, సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బజ్వా తెలిపారు. భాజపా కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:'ఆందోళనలను వీడండి.. చర్చలకు రండి'