Rahul Gandhi News: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై మరోసారి విమర్శలు చేశారు. భాజపా ప్రభుత్వం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతోందని.. రాష్ట్రాలు, భాషలు, చరిత్రలపై తమ సిద్ధాంతాలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. పార్లమెంట్లో బుధవారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. భాజపా దేశాన్ని రెండుగా విభజిస్తోందంటూ పునరుద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పేదలు భయపడతారని అనుకుంటున్నారు..
దేశాన్ని రెండుగా విభజించడం ద్వారా పేదలు బలహీనులై, ప్రశ్నించకుండా ఉంటారని కేంద్రం భావిస్తోందని.. కానీ పేదలు ఎవరికీ భయపడరని అన్నారు రాహుల్.
"నేను నిన్న లోక్‌సభలో రెండు ఇండియాల గురించి చెప్పాను. దేశం ప్రస్తుతం 2-3 ప్రధాన సమస్యలు ఎదుర్కొంటోంది. భాజపా తన సిద్ధాంతాలతో ఈ దేశాన్ని పెను ప్రమాదంలోకి నెడుతోంది. అందులో మొదటి ప్రమాదం ఈ దేశాన్ని రెండుగా విభజించడం. ఒకటి పేదలకు, ఇంకోటి సంపన్నులకు. ఇప్పుడు జరిగిన దేశాభివృద్ధికి కారణం పేదలు, కార్మికులు, రైతులు. అంతే కానీ ఏ రాజకీయ పార్టీ కాదు. ఈ 70 ఏళ్లలో దేశాభివృద్ధి ఏం జరిగిందని మీరు ప్రశ్నిస్తే.. అది రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులకే అవమానం.. కాంగ్రెస్ పార్టీకి కాదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దేశంలోని 100 మంది సంపన్నుల దగ్గరే.. 40శాతం దేశ జనాభా వద్ద ఉన్న దానికన్నా ఎక్కువ సంపద ఉందని ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా రాహుల్ పలు ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాయ్‌పుర్‌లో యుద్ధస్మారకం సహా గాంధీ సేవగ్రామ్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు.
ఇదీ చూడండి : చైనాపై భారత్ కన్నెర్ర- ఒలింపిక్స్ వేడుకల ప్రసారాలు బంద్!