వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ భాజపా జాతీయ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నారని, వాస్తవాధీన రేఖ వద్ద చైనాను అదుపు చేశారని కూడా అభినందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన ఆదివారం ఈ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇదే మంత్రం..
"అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం.. అనేదే భాజపా ప్రధాన మంత్రం. దాని లక్ష్యం.. దేశాభివృద్ధి, పార్టీ బలోపేతం. ఈ సూత్రం ఆధారంగానే జీఎస్టీ, వ్యవసాయ సంస్కరణలు వంటి మంచి పనులను చేయగలిగాం. మూడు వ్యవసాయ చట్టాల వల్ల కలిగే లాభాలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతిపక్షాలు, స్వార్థపర శక్తులు అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. వీటిపై అపోహలు తొలగేలా చూడడం ప్రతి కార్యకర్త కర్తవ్యం. 'దేశమే ప్రధానం' అనే ఎజెండాతో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి" అని సమావేశంలో మోదీ అన్నారు.
సంస్థాగతంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు చేరువ కావాలని పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ సూచించారు. తొలుత కరోనా కారణంగా మరణించిన వారికి ఈ సమావేశంలో సంతాపం తెలిపారు.
విదేశీ విధానంపై తీర్మానం చేస్తూ సరిహద్దుల్లో చైనాతో మెతకగా వ్యవహరించలేదని, అలాగని మరీ దూకుడును ప్రదర్శించలేదని కార్యవర్గం పేర్కొంది.
పెట్టుబడులకు అనుకూలం..
సమావేశం అనంతరం విలేకర్లతో మాట్లాడారు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. ప్రధాని మోదీ ధైర్యంతో చేపట్టిన సంస్కరణలను పార్టీ బలపరిచిందని చెప్పారు. "కార్మిక సంస్కరణల కారణంగా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. వ్యవసాయ చట్టాల సాయంతో రైతులు సంప్రదాయ మండీలతో పాటు ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశం కలిగింది" అని రమణ్ సింగ్ అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ రైతులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
భవిష్యత్తు భాజపాదే..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సమావేశం రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. "పశ్చిమ బంగాల్‌లో కచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే తృణమూల్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అసోంలో అధికారాన్ని నిలుపుకొంటాం. తమిళనాడు, కేరళల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తాం. పుదుచ్చేరిలో కీలక పాత్ర పోషిస్తాం" అని రమణ్ సింగ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, విదేశాలపై ఆధారపడడం తగ్గుతుందని తెలిపారు.
'పెట్రోలు ధరలపై చర్చించలేదు'
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతుండడంపై వేసిన ప్రశ్నను స్వీకరించడానికి రమణ్ సింగ్ నిరాకరించారు. ఈ సమస్యలపై ఇంతవరకు చర్చించలేదని అన్నారు.
ఇదీ చూడండి: 'చట్టాలు రైతుల పాలిట డెత్ వారెంట్ లాంటివే'