కర్ణాటక భాజపాలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. నాయకత్వ మార్పు కోసం.. పార్టీ రెబల్స్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో.. ఈ భేటీ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కడే.. తమ సమస్యలు చెప్పి సీఎంను తొలగించేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడియూరప్పను తొలగించాలని, నాయకత్వ మార్పు జరగాలని కర్ణాటక భాజపాకు చెందిన పలువురు సీనియర్లు కోరుతున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. దీనిపై స్పందించిన యడ్డీ.. హైకమాండ్ ఆదేశిస్తే తప్పుకోవడానికి సిద్ధమేనని, కానీ తనపై కేంద్రం నమ్మకం ఉంచిందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఓవైపు ఆయన మద్దతుదారులు సంతకాల సేకరణ చేపడుతుంటే, మరోవైపు.. యడియూరప్పను తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు తిరుగుబాటుదారులు.
వీరేనా రెబల్స్?
ఇటీవలే రాష్ట్ర మంత్రి సీపీ యోగేశ్వర్ దిల్లీకి పయనం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్, బసనగౌడ పాటిల్ యత్నాల్.. నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నారని తెలిసింది.
వీరంతా సీఎల్పీ సమావేశం జరగాలని డిమాండ్ చేయగా.. సున్నితంగా తిరస్కరించారు సీఎం. ఆ ఆలోచనే లేదని చెప్పకనే చెప్పారు.
కేంద్రం మద్దతు..
రాష్ట్ర భాజపా చీఫ్, పలువురు కేంద్ర మంత్రులు.. యడ్డీ నాయకత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సహా పలువురు పదవీకాలం ముగిసేవరకు యడియూరప్పనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.
ఈ తరుణంలో ఆయనను తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. మరి.. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర భాజపాలో అంతర్గత కలహాలు ఎలా తొలగుతాయో అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది.
సీనియర్లతో కయ్యం?
యడియూరప్ప ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు లేరని భాజపా భావిస్తోంది. అయితే.. ఇక్కడే యడ్డీని తప్పుబడుతున్నారు. ప్రత్యామ్నాయ నాయకులు ఉండరన్న వాదనను తాను అంగీకరించనని, ఎక్కడైనా ప్రత్యామ్నాయం ఉంటుందని ఆయన చేసిన ప్రకటన.. భాజపా అజెండానే ప్రశ్నిస్తున్నట్లుగా ఉందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. అంటే.. పరోక్షంగా కేంద్రంతో కయ్యానికి దిగుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నట్లు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: Yediyurappa: నా దృష్టంతా ఆ విషయంపైనే