తేయాకు కార్మికులకు రోజుకు రూ.351 కూలీ ఇస్తామని హామీ ఇచ్చిన భాజపా రూ.167 మాత్రమే ఇస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ దిబ్రూగఢ్‌లోని ఓ కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన రాహుల్.. విద్వేషాలతో ప్రజల మధ్య భాజపా విభజన సృష్టిస్తోందని దుయ్యబట్టారు.
"ఏ మతమూ శత్రుత్వం బోధించదు. కానీ భాజపా విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన తీసుకొస్తోంది. వారు ఎంత ద్వేషం వ్యాప్తి చేసినా.. ప్రేమ, సామరస్యతలనే కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది.
నేను నరేంద్ర మోదీ కాను. అబద్ధం చెప్పను. ఈ రోజు ఐదు హామీలు ఇస్తున్నాం. తేయాకు కార్మికులకు రూ.365 కూలీ, సీఏఏ రద్దు, 5లక్షల ఉద్యోగాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహిణులకు రూ.2000 ఇస్తాం.
మేకిన్ ఇండియా గురించి ప్రధాని మాట్లాడతారు. కానీ ఫోన్లు, షర్టులు చూస్తే మేడిన్ అసోం, మేడిన్ భారత్ బదులు వాటిపై మేడిన్ చైనా అని రాసుంటుంది. కానీ మాకు అసోంలో తయారీ అని చూడాలని ఉంది. అది భాజపాతో సాధ్యం కాదు. ఎందుకంటే వారు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
తేయాకు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోను టీ తెగలు, ప్రజలను సంప్రదించి రూపొందిస్తామని, రహస్యంగా కాదని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి నాగ్‌పుర్‌లో ఉన్న ఒక శక్తి యావద్దేశాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు.
రెండు రోజుల పర్యటన కోసం అసోంలో ఉన్న రాహల్.. శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను శనివారం విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌లో నాయకత్వమే కాదు సరైన విధానాలూ లేవు'
ఇదీ చూడండి: కేంద్రం X కేరళ: ఈడీపై పోలీసుల కేసు!