AAP MLA ON BJP Party: భాజపా గూండాల, రేపిస్టుల పార్టీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆప్ ఎమ్మెల్యే అతిషి. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి కేసులో అరెస్టైన కార్యకర్తలను భాజపా సన్మానించిందని.. భాజపాపై విరుచుకుపడ్డారు. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు విధ్వంసం సృష్టించాలనే సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. భాజపా మహిళలను వేధిస్తుందని.. గూండాయిజం దాని డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. దేశ ప్రజల ముందు గూండాల పార్టీ భాజపా, విద్యావంతుల పార్టీ ఆప్ రెండు అవకాశాలు ఉన్నాయని.. ఈ రెండింట్లో ఏది మంచిదో ప్రజలే ఎంచుకోవాలన్నారు.
భాజాపా కౌంటర్ అటాక్: ఆప్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఖండించారు. ఆమె తన నాయకుడి మెప్పు కోసమే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆప్ ఎమ్మెల్యే అత్యాచారం కేసుపై అతిషి పశ్చాత్తాపడాలన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే రాష్ట్ర మాజీ ముఖ్య కార్యదర్శిపై ఆప్ కార్యకర్తలు దాడి చేసారని గుర్తు చేశారు. భాజపా జాతీయవాదుల, దేశభక్తుల పార్టీ అని ఆయన కొనియాడారు. కశ్మీరి పండిట్ల విషయంలో కేజ్రీవాల్ తీరుపై.. తాము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపామన్నారు.
కేజ్రీవాల్ ఇంటిపై దాడి: మార్చి 30న 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై కేజ్రీవాల్ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడి జరిగింది. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీనిపై స్పందించిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. పంజాబ్లో ఆప్ ఘనవిజయం సాధించడాన్ని భాజపా జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు.
ఇదీ చదవండి: మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్