BJP parliamentary board members: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు చేపట్టింది. పాతవారిలో కొందరికి బోర్డు నుంచి ఉద్వాసన పలికిన భాజపా మరికొంతమందిని తీసుకుంది. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్ సహా ఓం మాథూర్, సుధా యాదవ్‌ను బోర్డులోకి చేర్చుకుంది.
ఇదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, షాహన్‌వాజ్ హుస్సేన్‌కు బోర్డు నుంచి ఉద్వాసన పలికింది. ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సత్యనారాయణ జతియా, కే లక్ష్మణ్‌ను బోర్డులోకి తీసుకుంది. ఇక భాజపా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా మార్పులు చేశారు. కొత్త వారితో కలిపిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.
మోదీ సర్కారులో అత్యంత సీనియర్ మంత్రి గడ్కరీకి ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కకపోవడం గమనార్హం. మరోపక్క పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం విశేషం. కర్ణాటకలో ఆయనకు ఉన్న పట్టు కారణంగా పార్టీలో కేంద్ర కమిటీల్లో స్థానం దక్కించుకొన్నారు.