రైతు ఉద్యమంలో భాగంగా.. అమరులైన కొందరు అన్నదాతలను ఉద్దేశిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి దలాల్, సీనియర్ భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. కేంద్రంలో, రాష్ట్రంలో.. పాలన కొనసాగించే నైతిక హక్కును భాజపా కోల్పోయిందని ధ్వజమెత్తారు.
రైతుల డిమాండ్లను ఆహ్వానిస్తూ కేంద్రం ఒక అడుగు వెనక్కి తగ్గితే మంచిదని అమరీందర్ సూచించారు. ఉద్యమంలో భాగంగా ఇద్దరు రైతులే మృతి చెందారన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సింగ్.. 102 మంది మృతుల కుటుంబాలకు స్వయంగా పంజాబ్ పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. 200 మందికి పైగా అన్నదాతలు అమరులైనట్లు మీడియా వర్గాలు కూడా వెల్లడించాయని చెప్పారు. ఉద్యమంలో మృతిచెందిన రైతులు ఇంటి దగ్గర ఉన్నా మరణించి ఉండేవారని హరియాణా వ్యవసాయ మంత్రి దలాల్ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.
అమరులైన రైతులకు కిసాన్ కల్యాణ్ ఫండ్ అందించామని తోమర్ చేసిన వ్యాఖ్యలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు అమరీందర్. సాగు చట్టాల పబ్లిసిటీ కోసం రూ.8 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. అమరులైన రైతులకు పరిహారం చెల్లించేందుకు మొహం చాటేయడం సరికాదన్నారు. సరైన వివరాలు తెలుసుకోకుండా రైతులపై వ్యాఖ్యలు చేయడం కేంద్రం అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రజలను ఐక్యం చేసింది
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సాధించిందేమిటని భాజపా పలుమార్లు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. కాంగ్రెస్, దేశ ప్రజలను కుల, మత తేడాలు లేకుండా ఐక్యం చేసిందని అన్నారు. నాటి బ్రిటిషనర్ల మాదిరిగా భాజపా 'విభజించు పాలించు' అనే సూత్రాన్ని నమ్ముకుని పరిపాలన చేస్తుందని అన్నారు. ఈ విధానానికి కాంగ్రెస్ పూర్తిగా భిన్నం అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:వేదిక మీదే కుప్పకూలిన ముఖ్యమంత్రి