BJP JDS Alliance In Karnataka : 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి జేడీఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అధికారికంగా ప్రకటించారు. తమ పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో పొత్తు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. పొత్తు విషయంలో తాను ఎలాంటి రహస్య కార్యకలాపాలు జరపలేదని అన్నారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో ఆదివారం జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో దేవెగౌడ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
"పొత్తులపై దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడాను. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి.. నేను చక్రాల కుర్చీపై అన్ని ప్రాంతాలకు వెళ్లగలను. జేడీఎస్‌ను కాపాడుకోవాలంటే బీజేపీతో పొత్తు తప్పనిసరి. నాపై విమర్శలు చేసిన వారిపై వ్యక్తిగత దూషణలకు దిగను. నైతికత లేని నాయకుల విమర్శలు గురించి పట్టించుకోను. నేను ప్రధాని కావాలని దిల్లీలో బీజేపీ నేతలను కలవలేదు. 40 ఏళ్లుగా తాను స్థాపించిన జేడీఎస్ పార్టీని కాపాడేందుకు బీజేపీ పెద్దలతో చర్చించా."
--దేవెగౌడ, జేడీఎస్ అధినేత
మరోవైపు.. తన కుమారుడు కుమారస్వామిపై ప్రశంసలు కురిపించారు దేవెగౌడ. కాంగ్రెస్-జేడీఎస్(2018) సంకీర్ణ కూటమిలో కుమారస్వామి రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేశారని అన్నారు. దేశంలో ఇంతలా రైతులకు అండగా నిలిచినా సీఎం ఎవరూ లేరని అన్నారు. అలాగే తన నైతికత గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని పరోక్షంగా హెచ్చరించారు.
"మోదీ నన్ను గౌరవిస్తారు. అలాగే హోం మంత్రి అమిత్ షాకు కూడా నా ప్రవర్తన తెలుసు. సీట్ల పంపకంపై ఇంకా చర్చించలేదు. రాష్ట్రంలోని ప్రతి సెగ్మెంట్లోని పరిస్థితిని దిల్లీ పెద్దలకు వివరించా. నా కుమారుడు కుమారస్వామి, బీజేపీ పెద్దలతో కూర్చొని సీట్ల పంపకంపై మాట్లాడుతారు. జేడీఎస్ మద్దతిస్తే చాలా స్థానాల్లో బీజేపీ విజయవకాశాలు పెరుగుతాయి. జేడీఎస్‌ను ఎవరూ అంతం చేయలేరు. గతంలో.. అటల్ బిహారీ వాజ్‌పేయి తమ పార్టీ మద్దతుతో నన్ను ప్రధానిని చేస్తానని ఆఫర్ ఇచ్చారు. నేను అందుకు తిరస్కరించాను. నా నైతిక గురించి మాట్లాడే అర్హత ఇతర పార్టీ నేతలకు లేదు" అని దేవెగౌడ వ్యాఖ్యానించారు.
'లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ'.. బీజేపీతో పొత్తుపై దేవెగౌడ క్లారిటీ