BJP Headquarters Staff Tested Positive: దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సుమారు 50 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిందని పార్టీ కార్యాలయం వెల్లడించింది.
పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం కానున్నాయి. ఈ రెండు భేటీలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావాల్సి ఉంది. ముందుజాగ్రత్తగా కార్యాలయ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆఫీసులో పని చేసే సుమారు 50 మందికిపైగా కరోనా సోకినట్లు తెలింది.
ఇప్పటికే భాజపాకు చెందిన కొందరు కీలక నేతలు కరోనా బారిన పడ్డారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కార్యాలయం మీడియా ఇన్‌ఛార్జ్ సంజయ్ మయూక్‌కు కూడా కరోనా సోకింది. దీంతో నేతలు హోం క్వారెంటైన్‌కు పరిమితం అయ్యారు. పాజిటివ్ వచ్చిన నాయకులు తరుచూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాలకు హాజరు కావడం కారణంగా వైరస్ వ్యాప్తి చెందినట్లు పార్టీ కార్యాలయం పేర్కొంది.
యూపీ ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై చర్చించిన భాజపా కోర్ కమిటీ మంగళవారం ఆరు గంటలకు పైగా కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యింది. దీనిలో కూడా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం జరగాల్సిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు సమావేశాలపై సందిగ్ధం నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ రాధా మోహన్ సింగ్ హాజరు కావాల్సి ఉంది. అయితే నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల నేతలంతా వర్చువల్‌గా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది.
ఇదీ చూడండి: యువత బలంతో ఉన్నత శిఖరాలకు భారత్: మోదీ