"భాజపాకు పూర్వరూపమైన జన్‌సంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పురిటి గడ్డపై అధికారంలోకి రావడం కమలదళం దశాబ్దాల కల. ఈ రాష్ట్రంలో సైద్ధాంతిక మూలాలను విస్తరించడం మాకు చాలా కీలకం. తూర్పు భారతంలో బంగాల్ మాకు అత్యంత ముఖ్యమైన రాష్ట్రం."
-- దిలీప్ ఘోష్, బంగాల్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు
దిలీప్ ఘోష్ మాత్రమే కాదు... భాజపా అగ్రనేతలందరి ఆలోచన ఇదే. 'బంగాల్ దంగల్'లో విజేతగా నిలవాలన్నదే వారి ఆకాంక్ష. మరి ఈ స్వప్నం నెరవేరుతుందా? అన్న ప్రశ్నకు అవుననే అంటున్నాయి భాజపా వర్గాలు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై వ్యతిరేకత, హిందుత్వ సిద్ధాంతం, కేంద్రంలో అధికారం, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి కలగలిసి... కమలదళాన్ని విజయతీరాలకు చేర్చుతాయని విశ్వసిస్తున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపు, 8 ఏళ్లలో ఓట్ల శాతం 10 రెట్లు పెరగడం, టీఎంసీ నుంచి కీలక నేతల చేరికలు వంటివి భాజపాకు అనుకూలిస్తాయని విశ్లేషిస్తున్నాయి. అయితే సంస్థాగతంగా బలహీనంగా ఉండడం, 'బయటవారు' అనే ముద్ర, మమతా బెనర్జీకి దీటుగా నిలబడే సీఎం అభ్యర్థి లేకపోవడం కమలదళాన్ని వేధిస్తున్నాయి.
దశాబ్దాల కృషి...
1952లో హిందు మహాసభ, భారతీయ జన్ సంఘ్ కలిసి బంగాల్‌లో 13 అసెంబ్లీ సీట్లను సాధించాయి. అవి సాధించిన ఓట్లు 8శాతం. 1953లో జన్‌సంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత బంగాల్‌లో వామపక్షాలు బలపడ్డాయి. ఫలితంగా 1967, 1971లో జన్‌సంఘ్ ఒక్కో స్థానంతో సరిపెట్టుకుంది. 1980లో భాజపా స్థాపన తర్వాత ఆ పార్టీ బంగాల్‌లో తన స్థానం సుస్థిర పరచుకోలేకపోయింది. 34 ఏళ్ల వామపక్ష పాలనలో 1998, 1999 మినహా కమలదళం ప్రభావం చూపలేకపోయింది. 1998, 1999లో టీఎంసీతో జట్టుకట్టిన భాజపా రెండు లోక్‌సభ స్థానాలు, ఉప ఎన్నికలో ఒక అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది.
2011లో వామపక్షాల కంచుకోటను టీఎంసీ బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. వామపక్షాలు, కాంగ్రెస్ క్రమంగా పట్టుకోల్పోగా భాజపా ఎదుగుదల సాధ్యపడింది. 2014లో కాషాయ పార్టీ సొంతంగా 19శాతం ఓట్లు, రెండు లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. 2016లో మూడు అసెంబ్లీ సీట్లు, 11శాతం ఓట్లు సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 40శాతం ఓట్లతో 18 సీట్లు దక్కించుకుంది. 2011 శాసనసభ ఎన్నికల్లో భాజపాకు వచ్చిన ఓట్లు 4 శాతం మాత్రమే కావడం గమనార్హం.
"2019లో పార్లమెంటు ఎన్నికల్లో భాజపా పుంజుకున్నప్పటికీ టీఎంసీ ఓట్ల శాతం 43గానే ఉంది. వామపక్షాల బలం 29 నుంచి ఏడు శాతానికి, కాంగ్రెస్ ఓట్ల శాతం ఆరు నుంచి నాలుగుకు పడిపోయింది. ప్రతిపక్షాలకు తగ్గిన బలమే భాజపాకు 2019లో 40శాతం ఓట్ల సాధించేందుకు కారణమైంది."
-- భాజపా సీనియర్ నేత
అదే జోరు కొనసాగి... ఇప్పుడు బంగాల్లోని 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200పైగా సీట్లు గెలుస్తామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. అంచనాల మేరకు కమలదళం బంగాల్‌లో గెలిస్తే అది సైద్ధాంతిక విజయం అవుతుందని అంటున్నారు ఆ పార్టీ నేత తధాగతరాయ్.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలతో..
ఒకప్పుడు వామపక్షాలు, టీఎంసీ బలంగా ఉన్న జంగల్‌మహల్, బంగ్లాదేశ్ శరణార్థులు ఎక్కువగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లో భాజపా బాగా పుంజుకుంది. బంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు పెరగడం భాజపా బలోపేతానికి కారణమైంది. అలాగే టీఎంసీ నుంచి సువేందు అధికారి, రాజిబ్ బెనర్జీ వంటి బలమైన నాయకులు వచ్చేందుకు పార్టీ తలుపులు తెరవడం భాజపా అధినాయకత్వం వ్యూహంలో కీలకాంశమైంది. తద్వారా తృణమూల్ కాంగ్రెస్ 'మునిగిపోయే నావ' అనే సంకేతం ప్రజల్లోకి వెళుతుందన్నది కమలదళం భావన.
ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ బలంగా ఉందని చాటే ప్రయత్నం కమలదళానికి తలనొప్పులు తెచ్చిపెట్టిందని భాజపా నాయకులు చెబుతున్నారు. ఇతర పార్టీల నాయకులకు ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం వల్ల మొదటి నుంచి పార్టీలోనే ఉన్న నేతలు, వారి అనుచరగణంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సరిగ్గా పరిశీలించకుండానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చేర్చుకోవడం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తద్వారా భాజపాలో అంతర్గతపోరు కొనసాగుతోందని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్-లెఫ్ట్- ఐఎస్ఎఫ్ కూటమి వల్ల ఎన్నికల్లో విపక్ష ఓట్లు చీలిపోతాయని కమలం పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
అవుట్‌సైడర్స్ ముద్ర...
బంగాల్లోని లక్ష ఎన్నికల బూత్‌లలో కమలదళానికి ప్రాతినిధ్యం లేకపోవడం పెద్ద బలహీనతగా మారింది. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం, ఇతర రాష్ట్రాల్లో నాయకులతో ప్రచారం చేయడం టీఎంసీ అవుట్‌సైడర్స్ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. తృణమూల్ ఎత్తుకున్న "బంగాలీ ప్రైడ్" నినాదం, భాజపా జాతీయ వాదం అంశానికి దీటుగా పనిచేస్తోంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలను తృణమూల్ సొమ్ముచేసుకునే అవకాశాలున్నాయని భాజపా నాయకులు చెబుతున్నారు.
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేసి ఓడినప్పటికీ భాజపాకు మరో విధంగా మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్ వరకు కేంద్రంలో భాజపా సర్కార్‌పై వ్యతిరేకత ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: 'బంగారు బంగాల్' మంత్రంతో భాజపా మేనిఫెస్టో!