శునకాలు, ఆవులు.. ఇలా పెంపుడు జంతువులకు అట్టహాసంగా జన్మదిన వేడుకలు జరిపిన సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అయితే నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే కోడికి పుట్టిన రోజు చేయడం ఎప్పుడైనా చూశారా? కనీసం ఎక్కడైనా విన్నారా? లేదు కదా! అయితే మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఓ కోడి పుంజుకు తొలి పుట్టినరోజు జరిపి వార్తల్లో నిలిచింది.
అనుకోకుండా..
నాగ్‌పుర్ జిల్లా ఉమ్రేడ్ తాలూకాలోని మంగళ్వార్ పేఠ్కు చెందిన ఉమాకాంత్ కాగ్దేల్వార్కు ఏడాది క్రితం ఓ కోడిపిల్ల దొరికింది. ఆ కొడిపిల్ల పౌల్ట్రీ వ్యాన్ నుంచి జారి, అతని షాపు ముందు పడింది. అప్పటి నుంచి దానిని కోడిలా కాకుండా.. తమ కుటుంబంలో ఓ సభ్యుడిలా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ కుటుంబమంతా దీనిని 'కుచాశేత్' అని పిలుస్తుంది.
బర్త్‌డే సెలబ్రేషన్స్..
పుత్ర సంతానం లేని ఉమాకాంత్.. ఆ కోడిని కొడుకులానే భావిస్తున్నారు. అతని కుమార్తె సురభి కూడా కుచాశేత్ను తమ్ముడిలా భావించి.. దాని ఆలనాపాలనా చూసుకుంటోంది. కుచాశేత్కు ఈ నెల 20 తేదీకి ఏడాది పూర్తయింది. దీంతో ఆ కోడికి సంప్రదాయ పద్ధతిలో తొలి పుట్టినరోజు జరిపించారు. తమ ఇంటిని అలంకరించారు. ఆ కోడి ఇష్టమైన జీడీపప్పు, వేరుశెనగ, శ్రీఖండ్ వంటి ఆహార పదర్థాలను తినిపించారు. కోడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిదన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు.. 'కోడికి పుట్టిన రోజు ఏంటో'.. అని ఆశ్చర్యపోతున్నారు.
ఇవీ చూడండి: