Birth And Death Registration Act 2023 : జనన మరణాల నమోదు (సవరణ) చట్టం.. 2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఇందులో భాగంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి, ఓటర్ జాబితాను సిద్ధం చేయడానికి, ఆధార్, వివాహా రిజిస్ట్రేషన్, ఉద్యోగ నియామకాలు తదితర అవసరాల కోసం సింగిల్ డాక్యుమెంట్ (Single Document Birth Certificate) జనన ధ్రువీకరణ పత్రం ఉపయోగిస్తారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. దీని ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జనన మరణాల డేటాబేస్లు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపింది. ఫలితంగా ప్రజలందరికీ పారదర్శకంగా సేవలను, సామాజిక ప్రయోజనాలను చేరువ చేయవచ్చని వెల్లడించింది. వివరాలను పారదర్శకంగా, సమర్థవంతంగా డిజిటల్ పద్ధతిలో నమోదు చేయొచ్చని తెలిపింది.
1969 చట్టానికి (Birth And Death Registration Act 1969) సవరణ కోరుతూ ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఆగస్టు 1న లోక్‌సభ ఆమోదించగా.. ఆగస్టు 7న రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం.. జనన మరణాలు నమోదిత డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు (Registrar General Of India) అధికారం కల్పిస్తుంది. ఇక, రాష్ట్ర స్థాయిలో చీఫ్ రిజస్ట్రార్ ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహిస్తారు. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలు నియమించే అధికారులు), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంత అధికార పరిధి కోసం రాష్ట్రాలు నియమించే అధికారులు) రాష్ట్ర స్థాయిలో జనన మరణ సమాచారాన్ని జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు.
ఇంతకుముందు వైద్యాధికారి మాత్రమే జనన మరణాలను రిజిస్ట్రార్‌కు నివేదించడానికి వీలు ఉండేది. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం ఈ పనిని కేంద్రం తయారుచేసిన నిర్దిష్ట జాబితాలోని వ్యక్తులు చేయవచ్చు. శిశువు తల్లిదండ్రులు, జననాన్ని రిపోర్ట్ చేసేవారి ఆధార్ నంబర్‌ను కూడా రిజిస్ట్రార్‌కు నివేదించాలి. ఒకవేళ ప్రసవాలు జైలులో జరిగితే జైలర్, హోటల్/లాడ్జిలో జరిగితే హోటల్ మేనేజర్ వంటి తదితరులు నివేదించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈ డేటాబేస్‌లో.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, అద్దె గర్భం ద్వారా జన్మించిన పిల్లల బయోలాజికల్ పేరెంట్స్, అవివాహితకు జన్మించిన పిల్లల తల్లిదండ్రుల వివరాలను సైతం నమోదు చేయనున్నారు.
ఈ కొత్త చట్టం ప్రకారం జనాభా, ఓటర్ జాబితా, రేషన్ కార్డులు వంటి తదితర డేటాబేస్లను ఏర్పాటు చేసే లేదా నిర్వహించే అధికారులకు.. ఈ జనన మరణాల జాతీయ డేటాబేస్ అందుబాటులో ఉంటుంది. జనన మరణాల నమోదు ప్రక్రియలో రిజిస్ట్రార్ల ఉత్తర్వులు లేదా చర్యల ద్వారా ఇబ్బంది ఏర్పడితే.. జిల్లా రిజిస్ట్రార్ లేదా చీఫ్ రిజిస్టార్లకు అప్పీల్ చేసుకునే వెసులుబాటును ఈ చట్టం పౌరులకు కల్పిస్తుంది. అలాంటి చర్య లేదా ఆర్డర్ అందిన నుంచి 30 రోజులలోపు అప్పీల్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఇక దీనికి అప్పీలేట్ అధికారి 90 రోజుల్లోపు తన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్ సర్టిఫికెట్తో పాటు ఆధార్