దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషుల విడుదలపై సుప్రీంకోర్టులో గుజరాత్ సర్కార్ దాఖలుచేసిన అఫిడవిట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులోని 11మంది దోషులు 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపారని.. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించినట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై నిర్ణయం తీసుకునే ముందు 1992 నాటి రెమిషన్ పాలసీ కింద అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది. కేవలం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా దోషులను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. అఫిడవిట్‌ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం దీనిపై నవంబరు 29న విచారణ జరపనున్నట్లు తెలిపింది.
అయితే దోషుల విడుదలను సీబీఐతోపాటు ముంబయిలోని ప్రత్యేక కోర్టు వ్యతిరేకించినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని సమాచారం. అంతేకాకుండా దోషులకు రెమిషన్ మంజూరు కోసం చేసిన ప్రతిపాదనలను గుజరాత్ సర్కారు కేంద్ర హోంశాఖకు పంపగా.. కేవలం 2 వారాల్లోనే అనుమతులు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక రెమిషన్‌కు ముందు కూడా దోషులు అనేక సార్లు పెరోల్‌పై జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తోంది. దాదాపు వెయ్యి రోజులకు పైనే వారికి పెరోల్ లభించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దోషులు పెరోల్‌పై జైలు నుంచి విడుదలైనప్పుడు తనను వేధించారని బాధితురాలు బిల్కిస్‌బానో గతంలోనేఆరోపించారు. అలాంటి వారిని సత్ప్రవర్తన కారణంగా ఎలా విడుదల చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బిల్కిస్ బానో కేసులో దోషులకు రెమిషన్ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గతంలో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణకు సంబంధించిన పూర్తి రికార్డులతోపాటు దోషులకు జారీ చేసిన రెమిషన్ ఆర్డర్‌నూ సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక, పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని సూచించింది. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం సోమవారం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివాదంపై ప్రధాని మోదీ, భాజపా సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎర్రకోట నుంచి మహిళల గౌరవంపై సుదీర్ఘ ప్రసంగాలు చేసి.. వాస్తవంగా రేపిస్టులకు మద్దతుగా ప్రధాని మోదీ హామీలు ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను ప్రధాని మోసం చేస్తున్నారని రాహుల్ ధ‌్వజమెత్తారు.
2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురినీ హత్య చేసిన దుండగులు.. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించగా.. 15 ఏళ్లు కారాగారంలో గడిపారు. అయితే వారికి రెమిషన్ మంజూరు చేస్తూ ఈ ఏడాది ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 15న 11మంది దోషులు జైలు నుంచి విడుదలయ్యారు. దోషుల విడుదలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలూ తీవ్రంగా ఖండించాయి. విడుదల వేళ దోషులకు మిఠాయిలు తినిపించి ఘన స్వాగతం పలకడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది.